iDreamPost
iDreamPost
సరిగ్గా 20ఏళ్ల కిందట వచ్చిన ఒక సినిమాలో ఒక హాస్య పాత్రద్దారుడు తన దగ్గరికి వచ్చిన పల్లెటూరు బైతుకి ఈ చార్మినార్ నాదే , ఈ రవీంద్రభారతి నాదే అంటూ అతనికి అంటకట్టే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా ఇలాగే ఉంది చంద్రబాబు వ్యవహారం కూడా.. తనవి కానివి తన విజయాలు అని చెప్పుకునేందుకు చంద్రబాబు నాయుడు పడే ఉబలాటం వేరే చెప్పనక్కరలేదు. ప్రపంచంలో మొట్టమొదట ఐటీని ప్రమోట్ చేసింది నేనే అని అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన మాటలు దగ్గర నుంచి సత్యనాదెళ్లకు నేనే స్పూర్తి అనే వరకు ఆయనని రాష్ట్ర ప్రజల ముందు నవ్వులపాలయ్యేలా చేశాయి.
ఇక తాజాగా ఆయన ఇదే ధోరణిని అనుసరించి తన ప్రమేయం లేని వ్యవహారంలో తన గొప్పలు చెప్పుకోబోయి ఏకంగా బోంబే ఐఐటీ విద్యార్ధుల ముందు రాష్ట్రం పరువును తీసినంత పని చేశారు. వివరాల్లోకి వెళితే బాంబే ఐఐటీ వారు నిర్వహించిన గ్లోబల్ లీడర్స్ సమిట్ లో విద్యార్ధులని ఉద్దేశించి వెబినార్ ద్వారా ప్రసంగించిన చంద్రబాబు ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ “మా అబ్బాయి లోకేష్ అమెరికాలో (1997 లో) చదువుకొంటుంటే,ఫోన్ చెయ్యాలంటే మూడు రోజులు పట్టేదని, ఫోన్ బిల్ వేలాది రూపాయలు వచ్చేదని, ఇలా ఖర్చు చేస్తే ప్రతిపక్షాలు ఏమంటాయో అనే భయంతో అప్పుడు ఒక్కటి ఆలోచించా.. కేంద్రంతో మాట్లాడి సెల్ ఫోన్ టెక్నాలజీ తెప్పించానని అని చెప్పి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచారు.
చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ మాటకు ఎలా స్పందించాలో తెలియని విద్యార్ధులు ఒక్క నిమిషం నిశ్చేష్టులుగా ఉండిపోయారు. ఐఐటీ విద్యార్ధులు అంటే దేశ రాజకీయల పైన దేశంలో జరిగిగే విప్లవాత్మకమైన అభివృద్దిపైన పూర్తి అవగాహన , పూర్తి సమాచారంతో ఉంటారు. అలాంటి వారి దగ్గర చంద్రబాబు ఈ విధంగా చెప్పడంతో వారు ఎలా స్పందించాలో అర్ధంకాక మిన్నకుండిపోయారు. నిజానికి విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి ఆహ్వానించే సరళీకరణ టెలికాం సెక్టార్ తో 1981 లోనే మొదలైంది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆల్కాటెల్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు కానీ అప్పటి ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగా ముందడుగు పడలేదు.
1984 లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అమెరికాలో నివసిస్తున్న సామ్ పిట్రోడాని ఇండియా రప్పించి సి-డాట్ ఏర్పాటు చెయ్యటం, డిజిటల్ ఎక్స్చేంజిలు ఏర్పాటు చెయ్యటం భారతదేశ టెలికాం రంగంలో అతి పెద్ద ముందడుగు. తర్వాతా పీవీ, మన్మోహ్మన్ ఆధ్వర్యంలో వచ్చిన సంస్కరణలు ఆ అభివృద్ధిని మరింత వేగవంతం చేశాయి.1995 జులై 31నఇండియాలో మొట్టమొదటి సెల్ ఫోన్ కాల్ చేసింది అప్పటి టెలికాం మినిస్టర్ సుఖరాం. మాట్లాడింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో. ఇండియాకి సెల్ ఫోన్లు తెచ్చింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు వైస్రాయి ఉదంతం నడిపి రామారావుని ముఖ్యమంత్రి పీఠం మీదనుండి దింపి సరిగ్గా నెలకు ముఖ్యమంత్రి అయ్యాడు.
దేశంలో సెల్ ఫోన్లు రావటానికి జ్యోతిబసు గారు చేసిన కృషి చూస్తే 1994 మధ్యలో, జ్యోతిబసు నాటి మోడీ టెల్స్ట్రా ఛైర్మన్ అయిన బి.కె.మోడిని, కలకత్తాలోని రైటర్స్ బిల్డింగ్ సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో ఆహ్వానించినప్పుడు ఈ విప్లవాత్మకమైన నిర్ణయానికి నాంది అని చెప్పాలి. ఆ సమావేశంలో బసు తన విలక్షణమైన పద్ధతిలో కలకత్తా నగరం మొబైల్ నెట్‌వర్క్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి నగరంగా అవతరించాలని సమావేశంలో పాల్గోన్న ప్రతినిధులకు నొక్కి చెప్పటంతో నాడే బి.కె.మోడి జూలై 31, 1995 రోజున ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం అని మాట ఇచ్చి చెప్పిన విధంగానే సరిగ్గా అదే తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుతో అప్పటి టెలికాం మినిస్టర్ సుఖరాంతో సెల్ ఫోన్ లో మాట్లాడేలా చేసి దేశంలో సెల్ ఫోన్ విప్లవానికి నాంది పలికారు.
వాస్తవాలు ఇలా ఉంటే తాను కేంద్రంతో మాట్లాడి తన కొడుకుతో మాట్లాడుకోవాలని ఉద్దేశంతో సెల్ ఫోన్ తెప్పించానని చెప్పటం చూస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇంత సులభంగా ఎలా అబద్దం ఆడగలిగారు అని బాంబే ఐఐటీ విద్యార్ధులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చంద్రబాబు ఈ విధంగా మాట్లాడి ఆయన పరువు పోగొట్టుకున్నది చాలక రాష్ట్ర ప్రతినిధిగా ఉండి రాష్ట్రం పరువుకూడా ఇతర రాష్ట్రాల ముందు తీస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకుల మాట.