iDreamPost
iDreamPost
వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరి తన హయాంలో జరిగిన వాటి గురించి ఏం సమాధానం చెబుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో ఘోరంగా విఫలమయిందని, దీనిపై న్యాయ విచారణ జరగాలన్నారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగాని తనమేనని విమర్శించారు. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్నారు. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సిడీని తగ్గించారని విమర్శించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని ఆరోపించారు. తుపాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి వరద విరుచుకుపడే వరకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో తగు చర్యలు తీసుకున్నా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇది విచారకరం. అయితే వాటిని ప్రభుత్వ హత్యలని సూత్రీకరించడం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తగునా అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వ హత్యలంటే ఇవీ..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1996లో పశ్చిమగోదావరి జిల్లా కాల్దరిలో రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే అసువులు బాశారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని ఆందోళన చేస్తున్న వారిపై బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పులు జరిపి ఆందోళనకారులను పొట్టన బెట్టుకున్నారు. 2015 గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కోసం జరిపిన షూటింగ్ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతిచెందారు. ఇవి కాకుండా ఆయన రాజకీయ జీవితంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మల్లెల బాబ్జీ, వంగవీటి రంగా, పింగళి దశరధరామ్ వంటి పలువురిని తుద ముట్టించారని కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నేతలు తరచు ఆరోపిస్తుంటారు. పై సంఘటనలపై ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించుకోలేదు సరికదా.. కొన్ని సందర్భాల్లో విచారణలకు ఆయన అడ్డుపడ్డారనే విమర్శలు ఎదుర్కొన్నారు. వీటికి ఎప్పుడూ సమాధానం చెప్పని చంద్రబాబు ప్రకృతి వైపరీత్యాల కారణంగా దురదృష్టవశాత్తూ జనం మరణిస్తే దానిపై రాజకీయం చేయడమేమిటి? ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడం కోసం విమర్శలు చేసే బాబు చివరకు చావులపై కూడా ఇలా దిగజారుడు వ్యాఖ‍్యలు చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.
Also Read : Amravati, Kanakamedala, Rajya Sabha – రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ
అవాస్తవాల ప్రచారం..
వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని, పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందడం లేదన్నారు. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అబద్దం చెప్పిందని ఆధార రహితమైన ఆరోపణలు చేయడం ఒక సీనియర్ నేత చేయవలసిన పనేనా? బీమా ప్రీమియం కట్టలేదని తనే అసత్య ప్రచారం చేస్తూ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదిగో ఆధారాలు అని ఎందుకు చూపడం లేదు? అసలు వరి వేయవద్దని రైతులకు ఎవరు, ఎప్పుడు చెప్పారు? ఇలా తన నోటికొచ్చిన ఆరోపణలు చేసి, పచ్చ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి జనాన్ని పక్కదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు రోజుకో అవాస్తవాన్ని మాట్లాడుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లట..
ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామన్నారు. తన ఐదేళ్ల పదవీకాలంలో పట్టుమని పదివేల ఇళ్లు కూడా కట్టని చంద్రబాబు పేదలకు ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఓటీఎస్‌ను తీసుకొస్తే దానిపైనా విషం చిమ్ముతున్నారు. పలు ఉచిత హామీలు ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక జనాన్ని మోసం చేయడంతోనే ఆయనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మళ్లీ తగుదునమ్మా అని ఉచితం మాటలు చెబితే ఎవరూ నమ్మరని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు. పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు ఇచ్చే ఇలాంటి పిలుపులకు జనం స్పందించడం ఎప్పుడో మానేశారని అంటున్నారు.
Also Read : Jagan, Chandrababu – ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా..? ఇకపై సీఎం జగన్..