iDreamPost
iDreamPost
ఈ సృష్టిలో ఒక చోట జరిగే ప్రతి పనిని మరో చోట జరిగే వేరొక పని ప్రభావితం చేస్తుంటుంది.. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారని ‘నాన్నకుప్రేమ’తో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సినిమాకి లాజిక్కులతో పనిలేకపోయినప్పటికీ ఇది వాస్తమే కావొచ్చు.
ఎందుకంటే ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ను దీని సిద్ధాంతకర్త కంటే ఎక్కువగా నారా చంద్రబాబునాయుడు నమ్ముతారనిపిస్తుంటుంది. ఆయన ఒక పని ప్రారంభించారంటే దానికి సంబంధించిన సొంత ప్రయోజనం ఎక్కడో తప్పకుండా ఉంటుందన్నది ఆయన అభిమానులు, వ్యతిరేకులు కూడా చెప్పే మాట. పార్టీలో నిర్ణయాలైనా, కాంగ్రెస్‌తో పొత్తయినా, రాజధాని నిర్మాణమైనా.. ఏదైనా గానీ దాని ప్రయోజనం చంద్రబాబుకు, ఆయన బృందానికి తప్పకుండా ఉంటుందన్నది వారందరి అభిప్రాయం. ఇప్పుడు తాజా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా చంద్రబాబు జూమ్‌మీటింగ్‌లో ఇటీవలే వెల్లడించారు.
అంటే ఇక్కడ ఏపీలో చాలా బలంగా ఉన్నాం, ఇక మిగిలిన తెలంగాణాలో కూడా బలోపేతం అయిపోదాం అన్నంత రేంజ్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు ఆ పార్టీ నాయకులే నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోవాల్సి వచ్చిందన్నది రాజకీయవిమర్శకుల మాట. ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడంతో తెలంగాణా టీడీపీని చంద్రబాబు గాలికొదిలేసారన్నది అక్కడి క్షేత్రస్థాయి నాయకుల పక్కా అభిప్రాయం. దీంతో 15 మంది ఎమ్మెల్యేలు అక్కడ గెల్చినప్పటికీ తమకు తోచిన దార్లో వాళ్ళు టీడీపీని వీడి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణాలో పార్టీ కేడర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదన్నది అక్కడివారి ఆవేదన. అయితే ఇప్పుడు కొత్తగా సమీక్షలు, పార్టీ పదవులు, తిరిగి పుంజుకోవడం అంటూ మళ్ళీ తెలంగాణావైపు చూస్తున్న బాబు వైఖరిని ఆ పార్టీనాయకులే అనుమానంతో చూస్తున్నారనది ప్రత్యర్ధి వర్గాల టాక్.
అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రతిపక్షందరికి చేరినప్పుడు కూడా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలు ఏపీలో టీడీపీ పరిస్థితిని రోజురోజుకూ దిగజారుస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పార్టీ పరిస్థితి మరింత దిగజారుతోందని సొంతపార్టీ నాయకులే నొచ్చుకుంటున్నారు. కేవలం అమరావతిని మాత్రమే నెత్తికెత్తుకోవడంతో ఇతర ప్రాంతాల ప్రజల్లో పార్టీపై వ్యతిరేక భావన ఏర్పడుతోందన్నది వారి వాదన.
అయితే ఇవేవీ పట్టించుకోకుండా అమరావతి కోసం పోరాడండి అంటూ ఉత్తరాంధ్ర, రాయయలసీమ టీడీపీ నాయకులకు చంద్రబాబు ఫోన్‌లు చేస్తుండడంతో వారు కనీసం ఫోన్లు కూడా ఎత్తకుండా తప్పించుకు తిరుగుతున్నట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి. చంద్రబాబు బృందం ఒత్తిడి ఎక్కువ కావడంతో పార్టీని వీడేందుకు కూడా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సిద్ధంగా ఉన్నారన్నది కూడా ఇటీవల విస్తృతంగా ప్రచారమవుతోన్న వార్త. ఈ విషయం తెలిసి బాబు కూడా ఏం చేయాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారన్నది రాజకీయ వర్గాల మాట.
సాధారణంగా ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు ప్రజలే కాకుండా సొంత పార్టీ నాయకులను కూడా ఏమార్చడంలో చంద్రబాబు సిద్ధహస్తులు. ఇప్పుడు తెలంగాణాలో పార్టీని బలపర్చే కార్యక్రమం కూడా ఆ విధంగా ఏమార్చడంలో భాగమేనన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. యేడాది క్రితం వరకు అధికారంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా గానీ ఏపీలోనే పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
అయితే కొత్తగా తెలంగాణాలో కూడా పార్టీని నడుపుతాను అనంటే ఎంత వరకు నమ్మడం అన్న మీమాంశ సొంత పార్టీ వాళ్ళలో కలుగుతోంది. ఏపీ టీడీపీలో ఏర్పడుతున్న సంక్షోభం నుంచి పార్టీ నేతల దృష్టిని మరల్చేందుకే ఈ విధమైన ఎత్తు వేస్తున్నారా? అన్న సందేహం టీడీపీ నేతల నుంచే ఉదయిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబు చేస్తున్న ఈ ‘బటర్‌ఫ్లై’ ప్రయోగం ఏ కొలిక్కి వస్తుందో, ఏ ప్రయోజనం చేకూరుస్తుందో కాలమే తేల్చాలి.