iDreamPost
iDreamPost
అసలే గత ఎన్నికలతో పాటు.. ఈ ఏడాది మొదట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలతో పూర్తిగా డీలా పడిన తెలుగుదేశం నేతలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పెండింగులో పడిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ కావడంతో మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఇంతకు ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల ఘట్టం తర్వాత ఓటమి భారాన్ని ఊహించి టీడీపీ అధిష్టానం బహిష్కరణ పేరుతో చేతులెత్తేసింది. పోటీ చేసిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించింది.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి సత్తా చూపాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసింది. అంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల ఖర్చు విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల నేతలను తలపట్టుకునేలా చేస్తోంది. బాధ్యతల వరకు ఓకే గానీ ఖర్చులు ఎలా భరించగలమని మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీల విషయంలోనూ టీడీపీ ఇదే నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ భారాన్ని ఆ జిల్లా నేతలపై మోపింది.
జిల్లా నేతలపైనే భారం
పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీకి గతంలో మంచి పట్టు ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే పునరావృతం అయ్యింది. అప్పట్లో జరగని పెనుకొండ నగర పంచాయతీ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. దీన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ జిల్లా స్థాయి నేతలందరినీ అక్కడ మొహరిస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి పరిటాల సునీత, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు అక్కడ వాలిపోయారు. అలాగే నగర పంచాయతీలో 20 వార్డులు ఉండగా.. వాటికి ఇంఛార్జీలుగా 20 మంది నేతలను నియమించారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలే కావడం విశేషం. వార్డుల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత వార్డు ఇంఛార్జీలపైనే మోపారు. పార్టీ ఎక్కడ ఓడిపోయినా సంబంధిత వార్డు ఇంఛార్జీలనే బాధ్యులను చేస్తామని అధిష్టానం స్పష్టం చేసింది.
ఇదెక్కడి తలపోటు
అభ్యర్థుల గెలుపు బాధ్యతే కాకుండా.. ఆయా వార్డుల్లో ఎన్నికల ఖర్చు భారాన్ని కూడా టీడీపీ అధిష్టానం ఎన్నికల ఇంఛార్జీలపైనే మోపింది. ఇదే నాయకులను సంకట స్థితిలోకి నెట్టింది. ఇటు బాధ్యతలు.. అటు ఆర్థిక భారం మోయలేమని వాపోతున్నారు. అసలే రెండున్నరేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నికలకు ఇంకో రెండేళ్లకుపైగా సమయం ఉంది. అంత వరకు సొంత నియోజకవర్గంలో పార్టీ భారం మోయాలి.. అదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అదే భారం అనుకుంటుంటే.. ఇప్పుడు ఈ అదనపు భారం ఎలా తట్టుకోగలమని మదన పడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరిద్దరు అధిష్టానం ఆదేశాలకు ఓకే చెప్పినా మిగతావారు మాత్రం అధిష్టానానికి ఎదురు చెప్పలేక.. ఖర్చులు ఎలా భరించాలో అర్థంకాక సతమతం అవుతున్నారు. ఏవో తంటాలు పడి భారీగా ఖర్చు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేనప్పుడు అదంతా వృథా అవుతుందని అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. సంక్షేమ పథకాలు, వరుస విజయాలతో దూకుడు మీదున్న అధికార వైఎస్సార్సీపీని.. అందులోనూ మంత్రి శంకర నారాయణ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలో సొంతంగా ఖర్చులు పెట్టి అభ్యర్థులను గెలిపించమని అధిష్టానం చెప్పడం తమ పీకల మీద కత్తి పెట్టడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : Chandrababu Naidu – Diwali : బాబు ‘హిందూ’ ప్రేమ.. బీజేపీని ఆకర్షించడానికా?