iDreamPost
android-app
ios-app

నేత‌ల ప‌రామ‌ర్శ‌ల‌కే స‌రిపాయే..!

నేత‌ల ప‌రామ‌ర్శ‌ల‌కే స‌రిపాయే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు బిజీబిజీగా గ‌డుపుతున్నారు. అదేదో పార్టీ కార్య‌క్ర‌మాల‌తోనో, సొంత ప‌నుల‌తోనో కాదు. పోనీ.. ప్ర‌భుత్వంపై పోరాటానికి స‌న్నాహ‌క స‌మావేశాల్లో అనుకుంటున్నారా.. అదీ కాదు. మ‌రి ఎందుకో అనుకుంటున్నారా..? అరెస్ట‌యి జైల్లో ఉన్న‌, జైలు నుంచి బెయిలుపై వ‌చ్చిన‌, దెబ్బ‌లు తిని గాయాల‌పాలైన త‌మ పార్టీ నేత‌లను ప‌రామ‌ర్శిస్తూ బిజీగా గ‌డుపుతున్నారు. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ బాబుకు ఇటీవ‌ల ఈ యాత్ర‌ల‌తోనే స‌రిపోతోంది. ఆ ఇద్ద‌రు నేత‌లు మ‌రో ద‌ఫా అచ్చెన్న ప‌రామ‌ర్శ‌కు వెళ్ల‌బోతున్నార‌ట‌.

ఆ పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యి ఇటీవ‌లే బెయిలుపై విడుద‌ల‌య్యారు. ఆమెను నేరుగా క‌ల‌వ‌క‌పోయినా.. ఫోన్ లో చంద్ర‌బాబునాయుడు ప‌రామర్శించారు. ఇటీవ‌ల ప‌ట్టాభిని కూడా ప‌రామ‌ర్శించారు. అలాగే గ‌తంలో ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి బెయిలుపై బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ను చంద్రబాబు, లోకేశ్ ప‌రామ‌ర్శించారు. అంత‌కు ముందే కొల్లు ర‌వీంద్ర‌, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. వంటి వాళ్ల‌ను కూడా ప‌రామ‌ర్శించారు. వారు ఇద్ద‌రు కూడా ప‌లు అక్ర‌మాలు, నేరాల‌లో జైలుకెళ్లి బెయిలుపై వ‌చ్చిన వాళ్లే. ఇప్పుడు మ‌రో రౌండ్ లో అచ్చెన్నాయుడును ప‌రామ‌ర్శించనున్నార‌ట‌.

ప్రెసిడెంట్ ఎన్నిక‌ల్లో ర‌చ్చ చేయ‌బోయి అరెస్టు అయిన తెలుగుదేశం నేత‌, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అరెస్టు అయ్యే ముందు త‌ను కాబోయే హోం మంత్రిని అంటూ.. అంద‌రి అంతూ చూస్తానంటూ అధికారుల‌ను హెచ్చ‌రించిన అచ్చెన్నాయుడుకు.. మంత్రి ప‌ద‌వి విష‌యంలో హామీ ఇవ్వ‌డానికి వెళ్తున్నారో, హెచ్చ‌రించ‌డానికి వెళ్తున్నారో కానీ.. చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ చెరో ద‌ఫా అచ్చెన్న‌ను ప‌రామ‌ర్శిస్తార‌ట‌.

జైల్లో ఉన్న అచ్చెన్నాయుడును ప‌రామ‌ర్శిస్తే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత య‌ధావిధిగా ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చే స్తూ.. కుల రాజకీయాలకు తెర తీస్తారా.. లేదా సైలెంట్‌గా ఉంటారా చూడాలి.

త‌మ పార్టీకి చెందిన‌ ఏ కుల‌, ఏ సామాజిక‌వ‌ర్గం నేతలు అరెస్టు అయితే ఆ కుల రాజ‌కీయం చంద్ర‌బాబుకు కొత్త కాదు, దాన్నే లోకేష్ అవ‌పోస‌న ప‌ట్టిన‌ట్టున్నాడు. కాబ‌ట్టి అచ్చెన్న అరెస్టుపై కులం కోణంలోనే స్పందించే అవ‌కాశాలున్నాయి. అచ్చెన్నాయుడును మ‌రోసారి కూడా నేరుగా ప‌రామ‌ర్శిస్తే.. భూమా అఖిల‌ప్రియ‌ను నిర్ల‌క్ష్యం చేసిన‌ట్లే అవుతుంది. ఇప్ప‌టికే ఇరు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలూ క‌క్ష క‌ట్టాయ‌ని జ‌గత్ విఖ్యాత్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఆ జిల్లా నేత‌లు కూడా చంద్ర‌బాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో రౌండ్ లో అచ్చెన్న‌తో పాటు.. అఖిల‌ను కూడా నేరుగా క‌లిసి ప‌రామ‌ర్శిస్తారేమో చూడాలి.