iDreamPost
android-app
ios-app

ఇంఛార్జి పదవా.. మాకొద్దు!

  • Published Aug 21, 2021 | 5:38 AM Updated Updated Aug 21, 2021 | 5:38 AM
ఇంఛార్జి పదవా.. మాకొద్దు!

ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయనడానికి ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితే నిదర్శనం. ఒకప్పుడు ఆ పార్టీలో పదవుల కోసం పోటీ పడేవారు. గ్రూపులు కట్టేవారు. గొడవలు పడేవారు. వాటిని సర్దుబాటు చేయలేక పార్టీ అధిష్టానానికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యేది. కానీ పరిస్థితి తిరగబడింది. పార్టీకి కొత్త తలనొప్పి పట్టుకుంది. ప్రాణ సంకటంగా మారింది. అప్పట్లో పదవుల కోసం పోటీ పడితే.. ఇప్పుడు పిలిచి పదవులు ఇస్తామన్నా ఎవరూ పలకడం లేదు. దాంతో నియోజకవర్గాలకు ఇంఛార్జిల నియామకం కొలిక్కి రావడం లేదు. రాష్ట్రంలో దాదాపు 30 నియోజకవర్గాలకు ఇంఛార్జిలు లేరు. వాటిని భర్తీ చేసేందుకు పార్టీ అగ్రనేతలు ఆరునెలలుగా కుస్తీ పడుతున్నా పూర్తి కావడంలేదు. ఇప్పటికి పది నియోజకవర్గాల నియామకాలనే అయ్యాయనిపించారు. ఇంఛార్జి పదవా.. మాకొద్దు అంటూ నేతలు జారుకుంటున్నారు.

నియామకాలకు చివరి నిమిషం గండం

సాధారణంగా నియోజకవర్గాల ఇంఛార్జిలుగా ఉంటూ ఏళ్లతరబడి బాధ్యతలు మోసినవారు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించడం సహజం. పార్టీలు కూడా వారినే అభ్యర్థులుగా నిర్ణయిస్తుంటాయి. కానీ టీడీపీలో ఎక్కువ సందర్భాల్లో దానికి భిన్నంగా జరుగుతుంటుంది. ఏ విషయాన్నైనా చివరి క్షణం వరకు తేల్చకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అదే చేస్తుంటారు. నామినేషన్ల ఘట్టం తుది దశ వరకు అభ్యర్థులను ప్రకటించరు. ఒకవేళ ప్రకటించినా చివరి నిమిషంలో మార్పులు చేస్తుంటారు. దాంతో అప్పటివరకు అభ్యర్థులు అనుకున్నవారి స్థానాల్లో సడన్ గా కొత్తవారు రంగప్రవేశం చేస్తారు. ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఏమాత్రం బాగులేదు. కీలక నేతలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కాడి దించేసి వేరే పార్టీలోకి వెళ్లిపోవడమో, పార్టీలో ఉన్నా సైలెంటుగా ఉంటూ సొంత వ్యవహారాల్లో నిమగ్నం కావడమో చేస్తున్నారు. దాంతో పార్టీ చేపట్టే కార్యక్రమాలు కూడా నియోజకవర్గాల్లో జరగడం లేదు. దీనికి తోడు చంద్రబాబు నైజం తెలిసిన నేతలు నియోజక వర్గ ఇంచార్జి పదవులు చేపట్టేందుకు ముందుకు రావడంలేదు. చేతి చమురు వదిలించుకుని ఇంఛార్జి బాధ్యతలు మోసినా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఒకవేళ టికెట్ ఇచ్చినా పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఈ రెండు అంశాలు నేతలను వెనక్కి లాగుతున్నాయి.

అభ్యర్థులు వారేనని భరోసా

చివరి నిమిషం మార్పులు, అప్పటివరకు రంగంలో ఉన్నవారిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమనే చంద్రబాబు మార్కు రాజకీయాల వల్లే పార్టీ ఇంచార్జిలుగా బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని పార్టీ అగ్రనేతలు గ్రహించారు. దాంతో పంథా మార్చి నేతలకు గట్టి హామీలతో నమ్మకం కలిగించకపోతే నష్టం తప్పదన్న భావనకు వచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం ఇంఛార్జి పదవులు చేపట్టే వారే 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని హామీ ఇస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 10 నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించగలిగారు. రామచంద్రపురానికి రెడ్డి సుబ్రహ్మణ్యం, కొవ్వూరుకు జవహర్, నర్సాపురానికి పొత్తూరి రామాంజనేయ రాజు, ఎర్రగొండపాలేనికి ఎరక్షన్ బాబు, తిరువూరుకు దేవదత్తు, కోడుమూరుకు ప్రభాకర్ను నియమించారు. మిగిలిన నియోజకవర్గాల విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థులు మీరేనని నాయకత్వం హామీ ఇస్తున్నా.. దానిపై నేతలకు ఇంకా నమ్మకం కలగకపోవడమే దీనికి కారణం. అలవాటు ప్రకారం చంద్రబాబు చివరి నిమిషం హ్యాండ్ ఇవ్వరన్న గ్యారెంటీ ఏమిటన్నది వారి వాదనగా ఉంది.

Also Read : నవ్విపోదురుగాక నాకేంటి! విస్మయం కలిగిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు