ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల జేఏసీ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ట్యాంక్‌బండ్‌కు వచ్చే అన్ని మార్గాలను మూసేసినా ఆందోళనకారులు వివిధ మార్గాల్లో అక్కడకు చేరుకున్నారు. జిల్లాల్లోనూ పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తరలివచ్చారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించి, లాఠీచార్జి చేయగా ఆందోళనకారులు సైతం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు లాఠీలు, తూటాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు నినాదాలు చేశారు. దాదాపు 3,800 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
సకల జనుల సామూహిక దీక్షను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించుకునేందుకు ఆర్టీసీ కారి్మకులకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ట్యాంక్‌బండ్‌పైకి ఎవరినీ రానీయకుండా అష్టదిగ్బంధనం చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద, మారియట్ హోటల్ వద్ద భారీ బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేయడంతోపాటు పారామిలటరీ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. అలాగే లోయర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ చౌరస్తా, ఇందిరాపార్క్, కట్టమైసమ్మ దేవాలయం, రాణిగంజ్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే మారియట్ చౌరస్తా, లిబర్టీ చౌరస్తాల వద్ద ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లే దారులను మూసేశారు. పదుల సంఖ్యలో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల్లా తరలివచి్చన కండక్టర్‌లు, డ్రైవర్‌లను గుర్తించి అరెస్టు చేశారు. బేగంపేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి.
కార్మికుల పట్ల ప్రభుత్వ తీరును ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండించాయి. కాగా, ఛలో ట్యాంక్ బండ్ విజయవంతమైందని కార్మిక జేఏసీ ప్రకటించింది. నిరసనలు కొనసాగిస్తామని పేర్కొంది. త్వరలో మరో బంద్ చేసే ఆలోచనల లో కార్మిక జేఏసీ యూ ఉన్నట్లు సమాచారం.