ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ విశాల్ కొత్త సినిమా చక్ర విడుదలకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది దీన్ని ఓటిటి ద్వారా డిజిటల్ రిలీజ్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన విశాల్ తన గత సినిమా యాక్షన్ తాలూకు ఆర్థిక లావాదేవీల వల్ల ఆ పని చేయలేకపోయాడు. అదంతా తేలేలోపు థియేటర్లు తెరుచుకున్నాయి. ఇక్కడ క్రాక్, అక్కడ మాస్టర్ కు వచ్చిన వసూళ్లు చూసి విశాల్ మనసు మార్చుకుని చక్రను సినిమా హాల్ కు తేవాలని డిసైడ్ అయ్యాడు. దానికి తగ్గట్టే డేట్ సెట్ చేసుకుని ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశాడు. కోలీవుడ్ లోనూ దీని మీద మంచి హైప్ నెలకొంది. ఇప్పుడు మరో సారి బ్రేక్ తప్పేలా లేదు.
తాజాగా మద్రాస్ హై కోర్టులో చక్రకు చుక్కెదురు అయ్యింది. రవి అనే తమిళ నిర్మాత ఈ సినిమా కథ తనదే నంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కొన్ని ఆధారాలు సమర్పించాడు కూడా. దీంతో ఇరు వాదనలు విన్న కోర్టు 18కి తీర్పు వాయిదా వేసింది. అంటే రిలీజ్ కు ఒక్కరోజు ముందన్న మాట. అది ఏ సమయంలో వస్తుందనే దాన్ని బట్టి చక్ర 19కి ఉంటుందా లేదా అనేది తేలిపోతుంది. విడుదల పరంగా విశాల్ మంచి స్కెచ్ ప్లాన్ చేసుకున్నారు. నైజామ్ లో వరంగల్ శ్రీను దీనికి తగినన్ని థియేటర్లు దొరికేలా ఇప్పటికే సెట్ చేసి పెట్టారు. అయితే ఇప్పుడు ఎలాంటి ట్విస్ట్ రాబోతోందో చూడాలి.
ఒకవేళ చక్రకు ప్రతికూలంగా తీర్పు వస్తే మూడు సినిమాలు లాభపడతాయి. అల్లరి నరేష్ నాంది అందులో మొదటిది. సీరియస్ ఇష్యూ మీద నరేష్ చేసిన ఈ ప్రయత్నం మీద అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇక సుమంత్ కపటధారికి అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. చక్ర డ్రాప్ అయితే ఆటోమేటిక్ గా దీనికి వెళ్లాలన్న ప్రేక్షకులు కపటధారి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రష్మిక మందన్న క్రేజ్ ని నమ్ముకుని వస్తున్న మరో కన్నడ డబ్బింగ్ పొగరుకు సైతం చక్ర వల్ల స్క్రీన్లు పెరుగుతాయి. అయితే కోర్టు జడ్జ్ మెంట్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఈ పరిణామాలు ఉండబోతున్నాయి