Idream media
Idream media
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కొత్త ప్రతిపాదనలు రూపొందించిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తాజాగా స్పందించి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో జీఎస్టీతో పాటు పలు విషయాలను కేసీఆర్ ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని తగ్గించడం సరికాదన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామన్న విషయాన్ని కూడా లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ‘చట్ట ప్రకారం రెండునెలలకోసారి బకాయిలు చెల్లించాలి. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్‌లో రాష్ట్ర ఆదాయం 83శాతం పడిపోయింది. అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, పేమెంట్ల భారం పెరిగింది. మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారా ఈ పరిణామాల నుంచి గట్టెక్కాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రూ. 3,800 కోట్లు నష్టపోయింది.
సరిగ్గా ఇదే కారణంపై రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా జీఎస్టీ పరిహార చట్టాన్ని రూపొందించారు. చట్టంలో అంత కచ్చితంగా నిబంధన ఉన్నా జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. ఆదాయం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వేతనాలు, ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది’ అని కేసీఆర్ లేఖలో రాసుకొచ్చారు.
ఆ వెసులుబాటు రాష్ట్రాలకు లేదు..
‘రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలంటూ కేంద్రం చెప్పడం సరికాదు. కేంద్రానికి ఉన్న ఆర్థిక వెసులుబాటు రాష్ట్రాలకు లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలకు అదనంగా సాయం చేయాల్సిన కేంద్రం ఈ విధంగా కోత విధించడం తగదు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం మొత్తాన్ని చెల్లించాలి. దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌లకు కూడా కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది.. ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్ధం’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు