iDreamPost
iDreamPost
మోదీ ప్రభుత్వం మొండికేస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ బీజేపీ నేతల మాటలకు, కేంద్రంలో అధికార పెద్దల చేతలకు పొంతన కనిపించడం లేదు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి బీజేపీ పెద్దలకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్‌లో కేవలం ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రెండవసారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55,548 కోట్లను 2019 ఫిబ్రవరిలో జరిగిన సలహా సంఘం సమావేశం ఆమోదించినట్లు తెలిపారు. తదుపరి దీనిని పరిశీలించిన రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం 35,950 కోట్లకు మాత్రమే ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదికను సమర్పించిందని మంత్రి వివరించారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుందని తేల్చేశారు.
గడిచిన రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం నుంచి పలుమార్లు విన్నవించినా కేంద్రం కనికరించడం లేదని మరోసారి స్పష్టమయ్యింది. పోలవరం పూర్తికావాలంటే ప్రస్తుతం కనీసంగా మరో 30వేల కోట్లు కావాల్సి ఉంది. అందులో ముఖ్యంగా పునరావాసం కోసమే దాదాపుగా రూ. 20వేల కోట్లు అవసరం అవుతాయి. అలాంటిది కేంద్రం మాత్రం తాము దానికి సిద్ధంగా లేమనే సంకేతాలు ఇవ్వడం విస్మయకరంగా మారింది.
2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలను రీయంబర్స్ చేసిందని మంత్రి వివరించారు. జాతీయ హోదా రాక ముందు చేసిన పనులకు గానూ రూ. 6వేల కోట్ల నిధులు తమ పరిధిలోకి రావని కేంద్రం అంటోంది. దాంతో పాటుగా విద్యుత్ ప్రాజెక్టు, కాలువల నిర్మాణం వంటి ఖర్చుల విషయంలో కూడా కొర్రీలు వేస్తోంది.
ప్రస్తుతం అదనంగా మరో 711 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్ కోరుతూ ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు మంత్రి చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే నూరు శాతం భరించడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి రాజ్యసభలో చెప్పడం విశేషం. తదనుగుణంగా పోలవరం పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించి, సిఫార్సు చేసిన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రీయంబర్స్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అయితే కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు అనే మాట ఇక గాలికెగిరిపోయినట్టేనని చెప్పవచ్చు. అంతేగాకుండా కేంద్రం మాత్రం నిర్వాసితులకు పునరావాసం సహా వివిధ అంశాల మీద స్పందించడం లేదని తేలిపోతోంది. ఇది ఏపీ ఆశల మీద మరోసారి నీళ్లు జల్లిన చందంగానే ఉందని చెప్పవచ్చు. ఏడేళ్లలో 11వేల కోట్లు..అది కూడా నాబార్డు ద్వారా అందించి చేతులు దులుపుకునే యత్నంలో మోడీ ప్రభుత్వం ఉండడం ఆందోళనకర విషయంగా భావించాలి.
Also Read : Tdp, Yellow Media, Employees Unions – టీడీపీ, పచ్చ మీడియా కలిసి ఉద్యోగ సంఘాలను వాడుకోవాలని చూస్తున్నాయా..?