iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏమన్నారో గుర్తుందా. 2014 ఎన్నికల హామీలు మరచిపోయినా, 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం సభ సాక్షిగా పోలవరం గురించి ఆయన ఇచ్చిన హామీ అందరికీ తెలిసే ఉండాలి.
చంద్రబాబు హయాంలో ఆ ప్రాజెక్టుని ఏటీఎంలా మార్చుకుని అవినీతికి పాల్పడుతున్నారని, తాము మాత్రం అది పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తున్నామని స్వయంగా ప్రధాని చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే ఏడేళ్లలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 11వేల కోట్లు మాత్రమేనని ఇటీవల కేంద్రం పార్లమెంట్ కి చెప్పింది. అంటే ఏడాదికి రూ. 1500 కోట్లు ఇస్తూ చేతులు దులుపుకుంటోంది. ఏటా అదే మొత్తంలో నిధులు ఇస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తికావాలన్నది అంతుబట్టని అంశంగా ఉంది.
అదే సమయంలో బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ అంటూ కొర్రీలు పెడుతోంది. దానికి గతంలో చంద్రబాబు హయాంంలో జరిగిన వ్యవహారాలను ఆధారంగా చూపుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయం పెంచడానికి తాము సిద్ధంగా లేమనే సంకేతాలు ఇస్తోంది. ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యం కేంద్రం వద్ద ఉందా అనే సందేహాలు రేకెత్తిస్తున్నారు.
తీరా చూస్తే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు అనుగుణంగా తాజాగా కెన్-బెత్వా నదుల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూపీ, ఎంపీ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకి నిధులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్న కేంద్రం చివరకు పూర్తిచేసిన పనులకు కూడా కొర్రీలు వేస్తోంది. ఎడమ కాలువ పనుల బిల్లులను చాలాకాలంగా నిలిపివేసింది. సీడబ్ల్యూసీ, పీపీఏ పేరుతో కొర్రీలు వేస్తూ కాలయాపన చేస్తోంది.
Also Read : మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఎంత కష్టం..!
జాతీయ ప్రాజెక్టు విషయంలో ఇన్ని నిబంధనలతో సాగుతున్న కేంద్రం ఈ కెన్ బెత్వా నదుల ప్రాజెక్టు విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఏకంగా రూ. 44605 కోట్ల ప్రాజెక్టులో కేంద్రం తన వాటాగా రూ. 36,290 కోట్లు గ్రాంటుగా చెల్లించేందుకు అంగీకరించింది. పోలవరం నిర్మాణానికి నిధుల విషయంలో నీళ్లు నమ్ములుతూ విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం ఉత్తరాదిలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో మాత్రం భిన్నంగా సాగుతోందనడానికి ఈ ఉదాహరణ సాక్ష్యంగా ఉంది. కేవలం గ్రాంటుగా 80 శాతం నిధులు ఇస్తూ మరో రూ. మూడున్నర వేల కోట్లను రుణంగా ఇచ్చేందుకు కూడా కేంద్రం ఆమోదించడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది.
ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పునరావాసమే ప్రస్తుత లెక్కల ప్రకారం రూ. 29వేల కోట్లు అవసరం కాగా, అందులో ఇప్పటి వరకూ రూ 11 వేల కోట్లు ఇచ్చి తామెంతో చేసినట్టు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వ పెద్దలు కెన్ బెత్వా విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం విస్మయకరంగా ఉంది. యూపీ, ఎంపీ రాష్ట్రాలకు ఉపయోగపడే ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని అంతా ఆహ్వానిస్తారు. కానీ అదే సమయంలో ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం విషయంలో చట్టంలో ఉన్న దానిని కూడా వక్రీకరించపూనుకోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ మీద కేంద్రానిది శీతకన్ను అనే విమర్శలకు ఆస్కారమిస్తోంది.
రాజకీయ అవసరాల కోసం కెన్ బెత్వా విషయంలో ఉదారంగా నిధులు ఇస్తూ, ఆంధ్రప్రదేశ్ పట్ల అనుచితంగా వ్యవహరించడం బీజేపీ వైఖరిని చాటుతోంది. ఉత్తరాది ప్రాజెక్టుల విషయంలో ఉన్న శ్రద్ద పోలవరం వంటి దక్షిణాది ప్రాజెక్టుల విషయంలో చూపకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నించడానికి అవకాశమిస్తోంది. ఇప్పటికయినా కేంద్రం పోలవరం విషయంలో చట్టాన్ని అనుసరించాలి. పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించాలి. అంచనాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం పదే పదే చేస్తున్న విజ్ఙప్తులకు ఆమోదం తెలపాలి. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుని పూర్తి చేయాలి. లేదంటే బీజేపీ కేవలం నాబార్డు ద్వారా ఇచ్చే రుణాలు మినహా పోలవరం విషయంలో మాటలకు, ఆచరణకు పొంతనలేకుండా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు నిజమవుతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా జరుగుతున్న జాప్యానికి మోదీ ప్రధాన బాధ్యుడవుతారు.
Also Read : విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం తడవకో మాట ఎందుకు చెబుతోంది..?