iDreamPost
android-app
ios-app

ఏపీ బంద్‌పై కేంద్రం ఆరా..

ఏపీ బంద్‌పై కేంద్రం ఆరా..

ఏపీలో విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి మార్మోగుతోంది. పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా ప్రభుత్వం సహా, విపక్షాలు, కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో పోరాడుతున్నాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన బంద్‌ విజయవంతం అయింది. మరోవైపు ప్రభుత్వం కూడా బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకూ ఆపేసింది. రాష్ట్ర మంత్రులు కూడా బంద్‌లో పాల్గొని కార్మికులకు మద్దతు ఇచ్చారు. ఉదయమే మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఇతర వైసీపీ నాయకులు మద్దిలపాలెం జంక్షన్‌కు వచ్చి కేంద్రం నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌పై ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా కేంద్రం నివేదికను తెప్పించుకున్నట్లు తెలిసింది.

వైసీపీ ఆందోళనకు భారీ స్పందన

ఉక్కు సంస్థ పరిరక్షణ కోసం ఏపీ పిడికిలి బిగించింది. రాజకీయపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నినదిస్తున్నాయి. బంద్‌ సందర్భంగా ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్ల ముట్టడి, ర్యాలీలు, మానవహారాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, నినాదాల ప్రతిధ్వనులతో హోరెత్తించారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ప్రభుత్వం కూడా మద్దతివ్వడంతో విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితం అయ్యాయి. ముఖ్యంగా.. ఈ నిరసనకు ముఖ్య కార్యక్షేత్రమైన విశాఖ నగరంలో.. ఉదయం ఆరు గంటలకే వెసీపీ, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు మద్దిలపాలెం సెంటర్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించారు. మద్దిలపాలెం జంక్షన్‌ వద్ద వైసీపీ నేతలు చేసిన ఆందోళనలకు భారీగా స్పందన వచ్చింది. మద్దిలపాలెం కూడలిలో జరిగిన ఆందోళనలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు

అలాగే పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టి…ధర్నా చేశారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేశారు. ప్రాణాలు అర్పించైనా స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. బంద్‌కు అధికార పార్టీ మద్దతు కూడా ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ ముందుగానే సెలవు ప్రకటించేశాయి. వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌ అన్నీ మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో షోలు వేయకుండా నిలిపివేశారు. ఉద్యోగులు రాకపోవడంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయాయి. స్టీల్‌ప్లాంటులో ఉత్పత్తికి ఆటంకం కలగకుండా కనీసం 70 శాతం మందైనా హాజరు కావాలని యాజమాన్యం కోరగా, కార్మిక సంఘాలు నిరాకరించాయి. అయితే ప్లాంటు పూర్తిగా ఆగిపోతే సమస్యలు వస్తాయని 50 శాతం మంది మాత్రం విధులకు హాజరయ్యారు. విజయవాడలో సుమారు మూడు వేల బస్సులు ఆగిపోగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా నిలిచిపోయాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించడంతో పట్టణాలు, నగరాలు రాష్ట్ర వ్యాప్తంగా వెల వెల బోయాయి.