Idream media
Idream media
భారీ వర్షాలతో మహానగరం ముంపునకు గురైన విషయం తెలిసిందే. దాదాపు 10 రోజులు కావస్తున్నా ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగానే ఉంది. బాధితుల ఇళ్లన్నీ బురదమయంగా మారాయి. మరోవైపు కేసీఆర్ సర్కారు బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇళ్ల యజమానులందరికీ ముందస్తుగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది. ఇదిలా ఉండగా.. గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో కేంద్రం బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌వశిష్ట నేతృత్వంలో 5గురు సభ్యులతో కూడిన అధికారుల బృందం తెలంగాణకు వచ్చింది. ప్రవీణ్‌వశిష్ట తో పాటు జల వనరుల విభాగం ఎస్ఈ రఘురాం, రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేస్ ఎస్ఈ కేష్వారాలు ఓల్డ్ సిటీలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మరో ఇద్దరు అధికారులు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పర్యటించారు.
విస్తుపోయిన అధికారులు
ముంపునకు గురైన పాతబస్తీలోని హఫీజ్ బాబానగర్ ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర అధికారులు విస్తుపోయారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. బాధితులతో మాట్లాడి తగిన సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇంటిలోని సామగ్రి మొత్తం నీళ్ల పాలైందని, కట్టుబట్టలు తప్పా ఇప్పుడు తమ దగ్గర ఏమీ లేవని అధికారులకు బాధితులు వివరించారు. ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయని తెలిపారు. బాధితుల మాటలు, అక్కడి పరిస్థితులను గమనించిన ప్రవీణ్ వశిష్ట ఎంతటి వర్షం కురిసినా మున్ముందు ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించారు. అందుకు పలు సూచనలను వారికి చేశారు. గగన్ పహాడ్ అప్పా చెరువును పరిశీలించిన అధికారుల దృష్టికి ఉద్దేశపూర్వకంగానే చెరువు కట్టను తెంచారని తెలిపారు. దీంతో వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
తొలి రోజుపర్యటనలో…
చార్మినార్ సమీపంలోని చాంద్రాయణగుట్టకు వెళ్లిన కేంద్ర అధికారులు ఫలక్ నుమా వద్ద దెబ్బతిన్న ఆర్ఓబీ, పక్కనే ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్ఓబీకి ఇరువైపులా ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ, వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించి పనులు ఎలా జరుగుతున్నాయని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంతలా ముంపునకు గల కారణాలను అడిగారు. పల్లె చెరువు తెగడంతో 15 అడుగుల వరకూ వరద ముంచెత్తిందని, కొన్ని చోట్ల మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చాయని బాధితులు వివరించారు. సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా నీళ్లలోనే గడుపుతున్నామని తెలిపారు. అలాగే కందికల్ గేట్ వద్ద నాలా పునరుద్ధరణ పనులను కూడా అధికారులు పరిశీలించారు.