iDreamPost
iDreamPost
భారత పార్లమెంట్ భవనాన్ని కూల్చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. ఎప్పటి నుండో ఈ వ్యవహారంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నా నేటికి కేంద్రం దీనిపై ఒక స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం డిల్లీ లో ఉన్న పార్లమెంట్ భవనం సుమారు 100 ఏళ్ళ పురాతనమైనదని , ఈ భవనాన్ని ఉపయొగించడం వలన పలు సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ భవనంలో నేటి అవసరాలకు తగ్గట్టు సదుపాయాలు లేవని, అలాగే భద్రతాపరంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయని కావున ఇప్పుడు ఉన్న ప్రస్తుత భవనాన్ని కూల్చి అదే స్థానంలో సరికొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన నిర్మాణం బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 1921 లో మొదలు పెట్టి 1927లో పూర్తిచేశారు. ఈ భవనాన్ని 1927 జనవరి18న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఐర్విన్ చేతులమీదగా ప్రారంభించారు. ఈ భవనాన్ని బ్రిటీష్ ఆర్కెటెక్ “హెర్బర్ట్ బేకర్” మరియు “ఎడ్విన్ లుటియెన్స్” లు సంయుక్తంగా డిజైన్ చేశారు. ఈ భవనాన్ని నిర్మించేందుకు నాడు 75 లక్షలు ఖర్చు చేశారు. సుమారు 100 సంవత్సరాలు కావస్తోన్న ఈ భవనాన్ని కూల్చేందుకు భారత ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశం అయింది.