సాధారణంగా ప్రభుత్వ వైద్య మంటే చిన్నచూపు ఉంటుంది. కానీ కరోనా కాలంలో ఈ పరిస్థితి మారిందనే చెప్పాలి. కోవిడ్ 19కు చికిత్స అందించే విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసీయంఆర్) సూచనల మేరకు వైద్యం అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందించే వైద్య విధానాలను క్రోడీకరించి ఐసీయంఆర్ దేశంలోని వైద్యులకు సూచిస్తుంది. ఈ విధానమే ఇప్పటి వరకు ఉన్న వాటిలో బెస్ట్ అనేందుకు బలమైన నిదర్శనాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఇప్పుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఖైదీలు అందుకు మరో ఉదాహరణగా నిలిచారు.
ఈ జైల్‌లోని మొత్తం 1700 మంది ఖైదీలకు గాను 300 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా గత నెలలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేల్చారు. వీరిలో పలువురు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, షుగరు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, మిగిలిన వారిని సెంట్రల్ జైలులోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరంలో వైద్యం అందించారు. అలాగే బలవర్ధకమైన ఆహారం కూడా వారికి ఇచ్చారు. చికిత్స అనంతరం ఇప్పుడు 300 మందికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్‌గా తేలింది. దీంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
అయితే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మాత్రమే వీరికి సేవలందించారు. ఖైదీల్లో మొత్తం అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం అందిస్తున్న వైద్యం, సేవలను అంచనా వేయొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి లోపాలను పెద్దవిగా చూపించే వారిని పక్కన పెడితే కరోనా నుంచి ఖైదీలు బైటపడడం ద్వారా ప్రభుత్వ వైద్యంలో నాణ్యత మరోసారి తేటతెల్లమైందని చెబుతున్నారు. లక్షలు గుంజే ప్రైవేటు వైద్యాన్నికి భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందిన ఖైదీలు నూటికి నూరుశాతం కోలుకోవడంతో సర్వత్రా ప్రభుత్వ వైద్య యంత్రాంగంపై ప్రసంసలు కురుస్తున్నాయి.
ఇదిలా ఉండగా గత ప్రభుత్వాల హాయంలో ప్రభుత్వ వైద్యశాలలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అందుకు భిన్నంగా సీయం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేసే చర్యలను చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయిదింటి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసింది.
మరోవైపు గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వైద్యం మెరుగుపరిచేందుకు నర్సింగ్ సిబ్బంది, అందుకు తగిన వైద్యులను కూడా కొత్తగా నియామకాలు చేపడుతోంది. తొలి విడతగా ప్రాథమిక వైద్య కేంద్రాల్లో 665 మంది వైద్యుల నియామకాలను చేపట్టింది. వీటిలో భర్తీకాని పోస్టులను గుర్తించి వెనువెంటనే నిమాకానికి ఉపక్రమించింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపర్చడానికి తాము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని వెల్లడించినట్లయింది.