iDreamPost
iDreamPost
భారతీయ రైల్వే వేగాన్ని పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దేశంలోని అత్యంత వేగంగా పరుగులు తీస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను వచ్చే మూడేళ్లలో ఏకంగా 400లకు పైగా తీసుకువచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. శక్తి ప్రాజెక్టు మూడవ దశలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు పెద్దపీట వేస్తున్నట్టు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కొత్త బడ్జెట్‌లో రైల్వే విభాగంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పటికే దేశంలో పరుగులు తీస్తున్నాయి. అతి త్వరలో 100 రైళ్లు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నహాలు చేస్తోంది. ఈ దశలో కేంద్రం ఏకంగా వచ్చే మూడేేళ్లలో నాలుగు వందలకు పైగా రైళ్లను తీసుకురావాలని నిర్ణయించడం గమనార్హం.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లకు దేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. మేకిన్ ఇండియాలో భాగంగా దీని నిర్మాణం శరవేగంగా పూర్తి చేశారు. రూ.97 కోట్లతో కేవలం 18 నెలల్లో ఈ ట్రైన్‌ను సిద్ధం చేశారు. మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వీటిపై ఆసక్తి నెలకొని ఉంది. తొలుత దీనిని ట్రెయిన్`18గా పిలిచేవారు. తరువాత కేంద్రం దీనికి వందే భారత్ అని పేరు పెట్టింది. దీనిని చెన్నై సమీపంలోని పెరంబూర్‌లోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో నిర్మించారు. ఇది సెమీ హై స్పీడ్ విభాగానికి చెందినది. 2019 ఫిబ్రవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. 16 కోచ్‌ల వరకు ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు, స్మోక్ అలారమ్స్, సీసీటీవీ కెమెరాలు, బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ కలిగిన వాటర్ ట్యాప్‌లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు. దీని గరిష్ట వేగం గంటకు 200 కిమీలు. అయితే ట్రాక్‌లను బట్టి ప్రస్తుతం గంటకు 160 కిమీల గరిష్ట వేగంతో నడుపుతున్నారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఇంజన్లు, ర్యాక్‌లు విడివిడిగా ఉంటాయి. కాని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ ఉన్న ర్యాక్‌లోనే ప్రయాణీకులు కూర్చునే అవకాశం ఉండడం విశేషం.
ప్రస్తుతం వారణాసి నుంచి న్యూఢిల్లీ (వారానికి ఐదు సార్లు), న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి కాట్రా (వారానికి ఆరుసార్లు), హౌరా నుంచి రాంచీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి వంద కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు రైల్వేలో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లపై అధిక ఆసక్తి చూపుతున్న కేంద్రం దీని కొనసాగింపులో భాగంగా వచ్చే మూడేళ్లల్లో ఏకంగా 400 రైళ్లు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవడం విశేషం.