iDreamPost
iDreamPost
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఒత్తిడి వణికిస్తోంది. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని కాపాడుకోవడం ద్వారా 2024 పార్లమెంటు ఎన్నికల విజయానికి పునాదులు వేసుకోవడం బీజేపీకి అత్యవసరం. అయితే పలు అంశాలు ప్రజావ్యతిరేకతను పెంచి యూపీలో బీజేపీ విజయంపై ప్రభావం చూపుతాయని గ్రహించిన కేంద్ర పెద్దలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించడం అందులో భాగమే. మరో కీలకాంశం పెట్రో ధరల పెరుగుదల. గత నెలలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీపై వీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. దాంతో పెట్రో ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు బయటకు తీసి దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచడం ద్వారా పెట్రో ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
రూ.100 కంటే దిగువకు తేవాలని లక్ష్యం
ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలతో ఇరకాటంలో పడిన కేంద్ర పాలకులు ఫలితాలు వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సయిజ్ సుంకాలు తగ్గించి లీటర్ పెట్రోలుపై రూ.5, డీజిల్ పై రూ.7 చొప్పున తగ్గించారు. తదనుగుణంగా వ్యాట్ కూడా తగ్గించాలని రాష్ట్రాలకు సూచించారు. కానీ చాలా రాష్ట్రాలు అందుకు అంగీకరించలేదు. ఎక్సయిజ్ సుంకాలు తగ్గించినా ఇప్పటికీ పెట్రో ధరలు మెజారిటీ రాష్ట్రాల్లో రూ.100కు పైనే ఉన్నాయి. దీనికి తోడు రోజువారీ ధరల సమీక్ష విధానం వల్ల మళ్లీ మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎలా అదుపు చేయాలన్న దానిపై కేంద్రం అనేక మార్గాలు అన్వేషిస్తోంది. చివరికి వ్యూహాత్మక నిల్వల్లో కొంత మార్కెట్లోకి పంపడం మినహా మరో మార్గం లేదన్న భావనకు వచ్చింది. అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇదే పద్ధతి అనుసరిస్తున్నాయి. అమెరికా సైతం భారత్ కు ఇదే సలహా ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ మేరకు ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా పెట్రో ధరలను రూ. 100 దిగువకు తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
వ్యూహాత్మక నిల్వలేమిటి?
యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం వంటి విపత్కర పరిస్థితుల్లో చమురు సంక్షోభం తలెత్తకుండా ప్రపంచంలోని చాలా దేశాలు ముడి చమురును నిల్వ చేసుకుంటుంటాయి.అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని దేశీయ అవసరాలకు వినియోగిస్తాయి. మన దేశం కూడా దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రెండు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తోంది. వాటిలో ఒకటి మన రాష్ట్రంలోని విశాఖపట్నంలోనే ఉంది. ఆ రెండు కేంద్రాల్లో ప్రస్తుతం 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. పెట్రో ధరలు తగ్గించడానికి ఆ నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురు బయటకు తీయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీన్ని మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ (ఎమ్మార్పీఎల్), హెచ్పీసీఎల్ సంస్థలకు అందిస్తారు. ఆ రెండు సంస్థలే వ్యూహాత్మక నిల్వ కేంద్రాలతో అనుసంధానం కలిగి ఉన్నాయి. ముడి చమురును శుద్ధి చేసిన అనంతరం ఆ సంస్థలే మార్కెట్లో అందుబాటులోకి తెస్తాయి. అవసరాన్ని బట్టి వ్యూహాత్మక నిల్వల నుంచి మరికొంత తీసేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.
Also Read : Up ,MIM- యూపీ బరిలో మజ్లిస్ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?