iDreamPost
iDreamPost
కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ లేఖ ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టానికి అనుగుణంగా కర్నూలుని న్యాయరాజధానిగా ఆ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది. కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించడంతో జగన్ నిర్ణయానికి మరింత మద్ధతు లభించినట్టయ్యింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో తన వైఖరిని స్పష్టం చేసింది. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమని తేల్చేసింది. తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది.
అదే సమయంలో న్యాయరాజధానిగా ఏపీ హైకోర్టుని తరలించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ముఖ్యంగా ఇప్పటికే అమరావతిలో హైకోర్టు కోసం రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని సవరించి కర్నూలు పేరుతో కొత్త గెజిట్ విడుదల చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా కేంద్రం కర్నూలు హైకోర్టుకి సుముఖంగా ఉన్నట్టుగా తాజాగా పౌరవిమానయాన లేఖ స్పష్టం చేస్తోంది. దాంతో మూడు రాజధానుల విషయంలో కీలకమైన అడ్డంకి తొలగినట్టుగానే భావించాలి.
కార్యనిర్వాహక రాజధానిలో సచివాలయం, రాజ్ భవన్, సీఎంవో ఏర్పాటు అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కాబట్టి దానిని పూర్తి చేయడానికి ఆటంకాలు దాదాపుగా లేవనే భావించాల్సి ఉంటుంది. కోర్టు విచారణ ప్రక్రియ పూర్తికాగానే దానికి అడ్డంకులన్నీ తొలగిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే న్యాయరాజధానిగా పేర్కొన్న కర్నూలు విషయంలోనే హైకోర్టు కోసం కేంద్రం ఎలా స్పందిస్తుందోననే ప్రశ్న ఇన్నాళ్లుగా ఉంది. కానీ ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చిన లేఖలో కర్నూలుని న్యాయ రాజధానిగా పేర్కొనడంతో సీమ వాసుల ఆశలు నెరవేరుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీభాగ్ ఒప్పందంలో భాగమైన హైకోర్టు ఏర్పాటుకి ఇన్నాళ్ల తర్వాత మార్గం సుగమం కావడం సంతృప్తినిస్తుందని చెప్పాలి.
కర్నూలు ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడంపై పౌరవిమానాయన శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల సీఎం ప్రారంభిస్తూ ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరుతో ఈ ఎయిర్ పోర్టు ఉంటుందని ప్రకటించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా రాష్ట్రంలో ఆరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావడం, సర్వీసులు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. విశిష్ట ప్రాంతంగా కర్నూలు పర్యాటకం, ఇతర రంగాల్లో అభివృద్ధికి ఈ ఎయిర్ పోర్టు తోడ్పడుతుందని కేంద్రం మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.