Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. రాష్ట్ర రాజధాని ఎంపికలో తమ పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడంలో తమ పాత్ర ఏమీ లేదని హైకోర్టుకు తెలిపింది. ఏపీ రాజధానిగా అమరావతిని అప్పటి ప్రభుత్వమే నిర్ణయించిందని తెలిపింది. ఈ మేరకు అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం వెల్లడించింది. సెక్షన్ 13 ప్రకారం ఒక రాజధాని మాత్రమే ఉండాలని లేదని అఫిడవిట్‌లో వివరించింది. రాజధాని లేదా రాజధానుల ఎంపిక విషయంలో తమ జోక్యం ఏమీ ఉండదని పునరుద్ఘాటించింది. రాజధాని ఎంపిక విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పిన కేంద్రం.. రాజధానికి అవసరమైన ఆర్థిక సహాయం మాత్రమే తాము చేస్తామని తెలిపింది. కేంద్రం పాత్రపై పిటిషనర్ లేవనెత్తిన అంశాలు అపోహలేనని పేర్కొంది.
2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేసిందని, అది 2019 జనవరి ఒకటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపింది. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ప్రధాన బెంచ్ తప్పక ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.