iDreamPost
android-app
ios-app

సింహాద్రి అప్పన్నకు కేంద్ర నిధులు

సింహాద్రి అప్పన్నకు కేంద్ర నిధులు

ప్రసాద్ పథకం కింద రూ.53 కోట్ల కేటాయింపు

సంచయితకు కేంద్రం ప్రశంసలు..

ఆడపిల్లకు ఆలయంతో పనేమిటి అన్నారు..
దాత్మకర్తల మండలి చైర్మన్ గా ఆమె పనికి రాదన్నారు.
ఇదంతా వైఎస్సార్సీపీ కుట్ర అన్నారు.. మా గజపతుల కుటుంబంలో చిచ్చుపెట్టే కుట్రలు అన్నారు…కానీ తాను మాత్రం గజపతుల ఆడబిడ్డను అని, అప్పన్న ఆలయ చైర్మన్ గా రావడం తనకు హక్కు అన్నారు.. మొత్తానికి పలు విమర్శలు, సందేహాల నడుమ సింహచలంలోని వరాహ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ అధిపతిగా వచ్చిన సంచయిత గజపతి రాజు తన సమర్థతను నిరూపించుకున్నారు. కేంద్రం 2015లో ప్రారంభించిన నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌(ప్ర‌సాద్‌) పథకం కింద ఎంపిక చేసిన దేవాలయాల జాబితాలో ఈ అప్పన్న ఆలయం చేర్చేందుకు ప్రయత్నించి ఈ మేరకు ఆమె సఫలం అయ్యారు. ఈ పథకం కింద కేంద్రం .53 కోట్లు నిధులు అందిస్తుంది. దీంతో ఆలయం మెట్లమార్గం తోబాటు పలు చోట్ల అభివృద్ధి పనులు చేపడతారు.

11వ శతాబ్దం నాటి ఈ ఆలయం ఇప్పుడు సరికొత్త సొబగులు దిద్దుకోనుంది.

ఆల‌య అబివృద్దికి కృషి చేస్తున్న మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్ ‌పర్సన్‌ సంచ‌యిత గ‌జ‌ప‌తి రాజుపై కేంద్రం బుధ‌వారం ప్ర‌శంస‌లు కురిపించింది. వ‌రాహ లక్ష్మీనృసింహ స్వామి దేవాల‌య అభివృద్దికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ శాఖ‌ ట్వీట్ చేసింది. కాగా దేశంలో ముఖ్య‌మైన ప‌ర్యాట‌క‌, ఆధ్యాత్మిక‌, ధార్మిక ప్ర‌దేశాలు అభివృద్ది చేసేందుకు కేంద్రం “ప్ర‌సాద్‌” ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తుంది. రాష్ట్రంలో శ్రీశైలం, తిరుప‌తి దేవ‌స్థానాల‌ను ఇప్ప‌టికే ఈ ప‌థ‌కం కింద‌ ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నారు. దీనివల్ల ఆధ్యాత్మిక పర్యటకాన్ని వృద్ధి చేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇదిలా ఉండగా ఈ విషయమై సంచయిత మాట్లాడుతూ తాను గత మార్చ్ లో కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు అందజేశానని, దానికి కేంద్రం సమ్మతించి నిధులు అందజేస్తుందని వివరించారు. దేవాలయ అభివృద్ధికి తాను కంకణం కట్టుకున్నానని, స్వామివారి సేవకురాలిగా ఇది తనకు ఎంతో ఆనందదాయకం అని అన్నారు. మొత్తానికి ఆమె అంటే గిట్టనివాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా తన సత్తాను చాటుకుని, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి విమర్శకులకు సమాధానం చెప్పారు.