iDreamPost
android-app
ios-app

బాబుల్ సుప్రియో రాజకీయ సన్యాసం

  • Published Aug 01, 2021 | 1:47 PM Updated Updated Aug 01, 2021 | 1:47 PM
బాబుల్ సుప్రియో రాజకీయ సన్యాసం

పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. సంచలనం సృష్టించారు కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబుల్.. రాజకీయ సన్యాసం తీసుకున్నారు. బీజేపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఏ పార్టీలోనూ చేరబోనని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర కేబినెట్‌లో తనకు చోటివ్వకపోవడం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో విభేదాల వల్లే తాను రాజకీయాల నుంచి దిగిపోతున్నట్లు చెప్పారు. కేబినెట్ నుంచి తప్పించడంపై ముందు నుంచీ అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత బీజేపీలో కీలక వికెట్ పడినట్లయింది.

పొగపెట్టారా?

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో బాబుల్‌ సుప్రియోకు విభేదాలున్నాయి. మొన్న జరిగిన బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబుల్ సుప్రియో పోటీ చేశారు. టాలీగంజ్‌లో పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో బాబుల్ సుప్రియో మంత్రి పదవిని కోల్పోయారు. దీనిపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన విషయంలో పొగబెట్టారంటూ సోషల్ మీడియాలో అక్కసు వెల్లగక్కారు. ‘‘పొగ ఉందంటే ఎక్కడో ఒక చోట మంట ఉన్నట్లే. అవును.. కేంద్ర మంత్రి పదవికి నేను రాజీనామా చేశాను. నన్ను రాజీనామా చేయమని కోరారు’’ అని సూటిగా అసలు విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి ఆలోచనలో ఉన్న ఆయన తాజాగా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ‘నేను వెళ్లిపోతున్నా.. అల్విదా’ అని ఫేస్‌ బుక్‌లో పోస్టు చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, చేరమని కూడా తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని.. సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదని, వేరే రంగంలో ఉన్నా సేవ చేయొచ్చని పేర్కొన్నారు.

తొలి సారి ఎంపీ.. వెంటనే కేంద్ర మంత్రి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుప్రియా బరాల్ అలియాస్ బాబుల్ సుప్రియో.. ప్రముఖ సింగర్. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో పని చేశారు. పలు హిందీ పాటలు పాడారు. స్టేజ్ షోలు ఇచ్చారు. 2014 మార్చిలో బీజేపీలో చేరారు. ఆ వెంటనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అసన్సోల్ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటి సారి ఎంపీ అయిన సుప్రియో.. ప్రధాని నరేంద్ర మోడీ తొలి కేబినెట్‌లో బెర్త్ దక్కించుకున్నారు. పలు శాఖల సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లోనూ గెలిచి.. మళ్లీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అటు బెంగాల్‌లో పార్టీ ఓటమి, ఇటు పార్టీ స్టేట్ చీఫ్‌తో విభేదాలు, మంత్రిగా పని తీరు.. ఇలా అన్నీ ప్రతికూలంగా మారడంతో వేటు పడింది.

Also Read : కేసీఆర్‌ మాట అన్నారంటే వెనక్కి తగ్గరు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రశంసల వర్షం