iDreamPost
android-app
ios-app

అంత మంది రాజీనామా చేయ‌డ‌మా..?

అంత మంది రాజీనామా చేయ‌డ‌మా..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కొత్త కేబినెట్ కొలువైంది. పాత‌, కొత్త వారితో క‌లుపుకుని తాజాగా 43 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ మ‌ర్నాడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా, కొత్త కేంద్రమంత్రివర్గ విస్తరణకు తీవ్ర క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, కేంద్ర మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్‌ విస్తరణ చేశారు. అయితే.. ఈ కొత్త టీమ్ ఎంత‌లా చ‌ర్చ‌నీయాంశ‌మైందో 14 మంది మంత్రుల‌తో రాజీనామా చేయించ‌డం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.

చివ‌రి నిమిషం వ‌ర‌కూ రాజీనామాల ప‌రంప‌రం

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ మొద‌లుకానుంద‌న్న వార్త‌లు ఓ వైపు.. కొంద‌రు మంత్రుల రాజీనామాలు మ‌రోవైపు.. కొన‌సాగుతుండ‌డంతో అస‌లేం ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి అంత‌టా ఏర్ప‌డింది. రాజీనామాలు చేస్తున్న వారిలో కేంద్రమంత్రివర్గంలోని సీనియర్లు సైతం ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మొదట కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కేబినెట్ విస్తరణకు కొద్ది నిమిషాల ముందు వ‌ర‌కు కూడా ఈ రాజీనామాల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. చివ‌రి నిమిషంలో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోపాటు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.

హర్షవర్ధన్‌ను బలిపశువు చేశారు..

అంత‌కు ముందే.. వ‌రుస‌గా సదానందగౌడ, థావర్‌చంద్‌ గెహ్లాట్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, హర్షవర్థన్‌, సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌, బాబుల్‌ సుప్రియో, సంజయ్‌ దోత్రే, రతన్‌లాల్‌ కతారియా, ప్రతాప్‌చంద్ర సారంగి, దేవశ్రీ చౌదరి వంటి రాజీనామా చేశారు. వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ రాజీనామాల ప‌రంప‌ర‌పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఇంత పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని మమత వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను తప్పించడంపై కూడా మమత స్పందించారు. ‘‘కేంద్రానికి పరిపాలనపై శ్రద్ధ ఉందని మీరనుకుంటున్నారా? అన్ని నిర్ణయాలూ మోదీయే తీసుకుంటారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను బలిపశువు చేశారు. నిజంగా వారికి పరిపాలన మీద శ్రద్ధే ఉంటే.. సెకండ్ వేవ్ వచ్చేదే కాదు. ఉన్నట్టుండి బబూల్ సుప్రియో, దేవశ్రీ అసమర్థులయ్యారా?’’ అంటూ వ్యాఖ్యానించారు.

ఆరోగ్య మంత్రి రాజీనామా అందుకే…

ఈ రాజీనామాల నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి చిదంబరం విమర్శలు గుప్పించారు. ‘కేంద్ర ఆరోగ్య మంత్రి, ఆరోగ్య మంత్రికి రాజీనామా చేయడం చూస్తుంటే.. మోడీ సర్కర్ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ఆయన పూర్తి స్థాయిలో విఫలమైందని స్పష్టంగా అంగీకరించినట్లే అని ఎద్దేవా చేశారు. ఈ రాజీనామాల్లో మంత్రులకు ఒక పాఠం ఉంది. అంతా సరిగ్గా జరిగితే క్రెడిట్ ప్రధానమంత్రికి వెళ్తుంది.., తప్పు జరిగితే మంత్రి విఫలమవుతారు. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘రాజీనామా చేయమన్నారు.. బాధగా ఉంది’

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బాబుల్ సుప్రియో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజీనామాపై స్పందిస్తూ.. బాబుల్‌ సుప్రియో ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారు. తాను రాజీనామా చేశానని.. ఇన్నాళ్లు తనకు మంత్రిగా పని చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా బాబుల్‌ సుప్రియో తన ఫేస్‌బుక్‌లో ‘‘అవును.. పొగ ఉందంటే.. తప్పకుండా ఎక్కడో ఓ చోట మంట ఉన్నట్లే.. విషయం తెలిసిన దగ్గర నుంచి నా మీడియా మిత్రులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.. కానీ అందరితో మాట్లాడటానికి కుదరడం లేదు. అవును మంత్రుల మండలికి నేను రాజీనామా చేశాను. నేను ముందు చెప్పినట్లుగానే.. నన్ను రాజీనామా చేయమని కోరారు.. చేశాను. ’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.