iDreamPost
iDreamPost
దేశవ్యాప్తం ఆందోళనకు కారణమైన ‘కొత్త వ్యవసాయ సాగు చట్టాల’ రద్దుకు తొలి అడుగు పడింది. రైతుల పోరాటానికి తలొగ్గి ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ప్రకటనకు అనుగుణంగా ఈ మూడు చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడిరచారు. ఆయన మాట్లాడుతూ మూడు సాగు చట్టాల రద్దుకు మంత్రివర్గం అధికారికంగా ఆమోద ముద్రవేసిందని తెలిపారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ఈనెల 19న ఒక ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నవంబరు 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకంటూ కేంద్రం మూడు చట్టాలను తెచ్చింది. దీనిలో మొదటిది రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం కాగా, రెండవది ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం. ఇక మూడవది నిత్యావసర సరుకుల చట్టం. గత ఏడాది జూన్ ఆరవ తేదీన కేంద్రం మూడు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చింది. సెప్టెంబరు 17న లోక్‌సభలోను, 20న రాజ్యసభలో ఆమోదించింది. అదే నెల 25 నుంచి ఈ బిల్లుల మీద దేశవ్యాప్త ఆందోళన మొదలైంది. ఈ మూడు చట్టాల వల్ల దళారీ వ్యవస్థ తగ్గుతుందని కేంద్రం చెప్పగా, ఈ బిల్లు వల్ల రైతులు మనుగడ కోల్పోతారని ఆందోళనకారుల వాదన.
ముఖ్యంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థకు ఈ చట్టం ముగింపు పలుకుతుందని రైతుల ఆరోపించారు. గత ఏడాది నవంబరు 25 నుంచి ఆందోళన హోరెత్తింది. ఢిల్లీ ముట్టడి, ఎర్రకోట వద్ద ఆందోళనలతో దేశరాజధాని అట్టుడికింది. ఎండనక, చలి అనక.. వాన అనక రోడ్ల మీద పడి రైతులు మడం తిప్పని పోరాటం చేశారు. ఎంతోమంది రైతులు మృత్యువాతపడ్డారు. ఏడాది నుంచి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కేవలం పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే ఉద్యమిస్తున్నారనే విమర్శలు వచ్చినా వారు వెనుదిరగలేదు. పోరాటంలో ఇతర అసాంఘిక వ్యక్తుల ప్రవేశం వంటి ఆరోపణలు వచ్చినా రైతులు వెన్నుచూపలేదు. ఉద్యమం మొదలై ఈ నవంబరు 26 నాటికి దాదాపు ఏడాది కానుంది. ఇదే సమయంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆరంభంలో కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల నేపథ్యంలో కేంద్రం వెనకడుగు వేసింది.
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు ` 2021 ని మంత్రివర్గం ఆమోదించారు. ఈ మూడు చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును రూపొందించనున్నట్టు సమాచారం. అయితే కేంద్రం వెనకడుగు వేసినా తమ పోరాటం ఆగదని రైతు సంఘాల ప్రతినిధులు తేల్చిచెప్పారు. కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) చట్టాన్ని తీసుకురావాలని తమ పోరాటం కొనసాగుతుందని ఆందోళన చేస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నుంచి ఇదే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.
Also Read : Swami ,TMC – సుబ్రమణ్య స్వామి పార్టీ మారుతున్నాడా?