iDreamPost
android-app
ios-app

రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రమే ఐఏఎస్,ఐపీఎస్ లను బదిలీ చేస్తుందట

  • Published Jan 25, 2022 | 2:21 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా  కేంద్రమే ఐఏఎస్,ఐపీఎస్ లను బదిలీ చేస్తుందట

కేంద్రం మరో అడుగు వేసింది. రాష్ట్రాల జాబితాలోని వివిధ అంశాలను కాజేసే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, మేజర్ పోర్టులు వంటి ఉమ్మడి జాబితాలోని అంశాలను కూడా కేంద్రమే ప్రభావితం చేసేలా చట్టాలు రూపొందించింది. దరిమిలా ఇప్పుడు అన్ని రంగాల్లోనూ వేలు పెట్టేందుకు అనుగుణంగా వ్యవస్థను మలచుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయానికి తావిస్తోంది.

ముఖ్యంగా కేంద్ర సర్వీసు అధికారుల నియమావళికి సంబంధించి తీసుకొచ్చిన మార్పులు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఈ నిర్ణయాన్ని నిరసిస్తున్నాయి. బీజేపీపాలిత రాష్ట్రాల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తంకావడం విశేషం. కేరళ, తమిళనాడు, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 9 మంది సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. తెలంగాణా ప్రభుత్వం తరుపున కేసీఆర్ కూడా అదే బాట పట్టారు.

అడ్మినిస్ట్రేషన్‌లో అత్యంత కీలకమైన ఐఏఎస్‌ అధికారులను కేంద్రం తన చేతిలో కీలుబొమ్మలుగా చేసుకోవాలని చూస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. తద్వారా రాష్ట్రాలపైనా, రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లోనూ ప్రత్యక్ష జోక్యానికి అవకాశం ఉంటుందనే వాదన బలంగా ఉంది. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను హరించే యత్నం చేశాయి. కానీ సైద్ధాంతికంగా బలమైన కేంద్రం, దాని మీద ఆధారపడేలా రాష్ట్రాలుండాలనే అభిప్రాయంతో ఉండే పార్టీగా బీజేపీ దానికి మరింత వేగంగా అడుగులు వేస్తోంది.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) ద్వారా నియమితులయ్యే ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగులను రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత బదిలీ వంటి వ్యవహారాల విషయంలో రాష్ట్రాల సమ్మతి ఇప్పటివరకూ తప్పనిసరి. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి పిలిపించుకోవడం కుదురదు. కానీ ఇకపై అలాంటి అవకాశం లేకుండా కేంద్రం తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అనుగుణంగా మార్పులు చేసింది.

రాష్ట్రాల అనుమతితో సంబంధంలేకుండా అధికారుల వ్యవహారాలను కేంద్రమే నిర్ణయించేందుకు అనుగుణంగా నిబంధనను మార్చేసింది. తద్వారా ఇష్టమొచ్చిన అధికారిని తన ఇష్టానుసారం బదిలీ చేసుకోవడం, వెనక్కి పిలిపించుకోవడం వంటి సవరణలు తీసుకొచ్చేందుకే కూడా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

కేడర్‌ నిబంధనలు (1954)లో ఆరవ పాయింటు సవరణ అందులో భాగమేనని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వాదన. దానికి కేంద్రం చెబుతున్న కారణం సహేతుకంగా కనిపించకపోవడం విశేషం. ఐఏఎస్ లు సంఖ్య రీత్యా తక్కువగా ఉన్నందున కేంద్రం పెత్తనానికి ఆస్కారమివ్వాలని ఆశించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ మేరకు నిబంధనల సవరణకు సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణా విభాగం ఈ నెల 12న రాష్ట్రాలకు లేఖ రాసింది. వాటిలో ఉన్న ప్రతిపాదనలో నాలుగు అంశాలు ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి.

రాజ్యాంగం ప్రకారం యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ (రాష్ట్రాల సమాఖ్య)గా పేర్కొన్నారు. కానీ తాజా ఉత్తర్వులు దానికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. శాంతిభద్రతలు, పరిపాలన వంటి కీలకమైన అంశాలు ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి. కానీ ఇకపై కేంద్ర సర్వీసు అధికారుల ద్వారా వాటిలో కేంద్రం పాత్ర పెంచుకునే ప్రయత్నం మొదలయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 356 ఆర్టికల్ ద్వారా కేంద్రం తమకు గిట్టని ప్రభుత్వాల పట్ల కొంత కఠినంగా వ్యవహరించిన అనుభవాలున్నాయి.

ఇక ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లోనే నేరుగా జోక్యం చేసుకుని అధికారుల ద్వారా వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నానికి ఒడిగట్టిందనే వాదన వస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆధిక్యం సాధించగలిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు. దాంతో ఈ చట్టం ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను తమకు అనువుగా మలచుకునే పనిలో ఉందని భావిస్తున్నారు. ఈ నిబంధనల్లో మార్పు జరిగితే ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల మాటను పెద్దగా ఖాతరు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ఇటీవల బెంగాల్ పరిణామాలు అందరికీ గుర్తున్నాయి. ముఖ్యంగా ప్రధానితో, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు వివాదమయ్యింది. అప్పట్లో సీఎస్ వ్యవహరించిన తీరు పట్ల కేంద్రం గుర్రుమంది. కానీ చివరకు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వచర్యను అడ్డుకోలేని పరిస్థితికి వెళ్లింది. దానికి పర్యవసానంగా భవిష్యత్తులో అధికారులు తమ మాట జవదాటకుండా చూసుకోవాలనే సంకల్పానికి మోదీ అండ్ కో వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. తాజా నిబంధనల సడలింపు అందులో ఓ ప్రయత్నమేనని అంటున్నారు. అంతిమంగా కేంద్రం మరింత బలపడుతూ రాష్ట్రాలను బలహీనం చేసే ప్రక్రియ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమనే వాదన పెరుగుతోంది.