శాంతిభద్రతల పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా పెడుతోంది. ప్రభావిత రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమీక్షకు సిద్ధమవుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు ప్రారంభం కావడం.. వాటిని ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలు విడుదల చేయడంపై ఆరా తీస్తోంది. అంతేకాకుండా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రెండు రోజుల్లోగా ఢిల్లీకి రావాల్సిందిగా సమాచారం పంపింది.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు..
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్రం ప్రభుత్వం ఈ నెల 26న ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మావోయిస్టుల అంశంతో పాటు, అభివృద్ధి పనులపై కూడా సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్రహోంశాఖ 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఆదివారం ఢిల్లీలో జరిగే హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నిశ్చయించుకున్నట్లు తెలిసింది. శనివారం అసెంబ్లీ సమావేశం ముగిసిన వెంటనే ఆయన 25న ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Also Read : పెగాసస్ నిఘా – సుప్రిం కీలక నిర్ణయం
ఒకే నెలలో మరోసారి ఢిల్లీకి కేసీఆర్..
ఒకే నెలలో మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల ఒకటిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లారు. వాస్తవానికి తొలుత షెడ్యూల్ మూడు రోజులు మాత్రమే అయినా.. ఆయన ఏకంగా అక్కడ ఎనిమిది రోజులు మకాం వేశారు. 2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈనెల 3న ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్ర హోంమత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు.
ఈసారి కేంద్రం పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ సమావేశం నేపథ్యంలో సీఎం కేసీఆర్ హోం శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు, ఆర్అండ్ బీ ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి… రాష్ట్రం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా హోం శాఖ ఉన్నతాధికారులు కీలక సూచనలు చేశారు.
Also Read : కోవిడ్ మృతులకు పరిహారం.. రాష్ట్రాలపైకి నెట్టేసిన కేంద్రం