iDreamPost
android-app
ios-app

చిరు రానాలకు ఇబ్బందులు తప్పవా

  • Published Apr 10, 2021 | 5:16 AM Updated Updated Apr 10, 2021 | 5:16 AM
చిరు రానాలకు ఇబ్బందులు తప్పవా

ఇటీవలే ఛత్తీస్గర్ లో జరిగిన భీకరమైన యుద్ధకాండలో ఇరవై మూడు సిఆర్పిఎఫ్ జవాన్లు బలిదానం చేసిన సంగతి తెలిసిందే. నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఈ మధ్యకాలంలో ఇదే. ఈ ఘటన పట్ల ప్రభుత్వాలు కూడా తీవ్రంగా స్పందించాయి. తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించాయి. దీనికి మన సినిమాలకు సంబంధం ఏమిటనుకుంటున్నారా. లింక్ ఉంది. ఆచార్య – విరాటపర్వంలో చిరంజీవి, రామ్ చరణ్, రానాలు నక్సలైట్లుగా కనిపించబోతున్నది ఓపెన్ సీక్రెట్. వాటి తాలూకు టీజర్లు పబ్లిసిటీ పోస్టర్లలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు కూడా. ఇప్పుడదే ఇబ్బందులను తెస్తోంది.

ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా పని చేసే యాంటీ టెర్రరిజం ఫోరమ్ ప్రతినిధులు సెన్సార్ బోర్డు సభ్యులను కలిసి ఇకపై వచ్చే సినిమాల్లో కనక నక్సలైట్లను హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తే వాటికి కట్టడి చేయాల్సిందిగా కోరారు. అంతేకాదు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఆచార్య, విరాటపర్వం సినిమాలను ప్రస్తావిస్తూ వీటిని క్షుణ్ణంగా పరిశీలించాకే రిలీజ్ చేయాలని, ఒకవేళ నక్సలైట్లను హై లైట్ చేసే విధంగా కథాకథనాలు ఉంటే మాత్రం వాటిని మార్పులు చేసే విధంగా లేదా నిషేధించేలా చేయాలని ప్రతిపాదించారు. మావోయిస్టు సిద్ధాంతాలను తెరమీద చూపకూడనేదే వాళ్ళ ఉద్దేశం

గతంలో నక్సలైట్ ఉద్యమాలను నేపధ్యంగా తీసుకుని ఆర్ నారాయణమూర్తి, మాదాల రంగారావు, దాసరి లాంటి దర్శకులు ఎన్నో సినిమాలు రూపొందించారు. వాటిలో ఎర్రసైన్యం, ఎర్రమల్లెలు, ఒసేయ్ రాములమ్మా లాంటివి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఎన్నో ఏళ్ళ తర్వాత చిరు రానా ఈ కథల వైపు మొగ్గు చూపారు. మరి సెన్సార్ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని ఆ కోణంలో సినిమాలు చూస్తుందా లేదా అనేది వేచి చూడాలి. విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కానుండగా ఆచార్య మే13 రావడం మీద పలు అనుమానాలు ఉన్నాయి