నిన్నటితో ఆంధ్ర ప్రదేశ్ లో బద్వేల్, తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నికల హడావుడి ముగిసింది అనుకుంటున్న నేపథ్యంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీన పోలింగ్ జరుగనుంది, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనున్నట్లు గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఇక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 17వ తేదీన నామినేషన్ల పరిశీలన 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. 29వ తేదీన ఎన్నికలు జరగనుండగా, అదే రోజున కౌంటింగ్, అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఆకుల లలిత, మహమ్మద్ ఫక్రుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం జూన్ 3వ తేదీ నాటికి ముగిసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వైసీపీ ఎమ్మెల్సీ చిన్న గోవింద రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్ పదవీకాలం మే 31వ తేదీ నాటికి ముగిసింది.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పటికే ఆశావహులు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ సాధించే పనిలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉండటంతో మూడు స్థానాలు కూడా అధికార వైసీపీకి దక్కనున్నాయి. తెలంగాణలో మాత్రం ఆరు స్థానాలకు గాను నాలుగు నుంచి ఐదు స్థానాలు టిఆర్ఎస్ కు కచ్చితంగా దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆరో స్థానానికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఆ కోటాలో ఉన్న ఎమ్మెల్సీల భర్తీ కూడా త్వరలో జరిగే అవకాశం కనిపిస్తోంది.