iDreamPost
android-app
ios-app

ఐదు రాష్ట్రాలు, తిరుపతి లోక్‌సభకు మోగిన నగారా

ఐదు రాష్ట్రాలు, తిరుపతి లోక్‌సభకు మోగిన నగారా

దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేచింది. ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసన సభలకు ఈ వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. వీటితోపాటు తిరుపతి లోక్‌సభ, నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానం సహా 16 రాష్ట్రాలలోని 34 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ జారీ చేసింది.

పటిష్ట ఏర్పాట్లు..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునిల్‌ అరోరా వెల్లడించారు. ఐదు రాష్ట్రాలలోని 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో లక్షకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 234 స్థానాలున్న తమిళనాడులో 89 వేల పోలింగ్‌ కేంద్రాలు, 140 స్థానాలున్న కేరళలో 40 వేల కేంద్రాలు, 126 స్థానాలున్న అస్సాంలో 33 వేల కేంద్రాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో 1500 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బందినే ఎన్నికల విధులకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా ప్రకటించారు. 80 ఏళ్లు దాటిన వారికి బ్యాలెట్‌ విధానంలో ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్రాలు, ఉప ఎన్నికలు జరిగే స్థానాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని సునిల్‌ అరోరా చెప్పారు.

బెంగాల్‌లో హోరాహోరీ..

పశ్చిమ బెంగాల్‌లో శాసన సభ ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి. హాట్రిక్‌ విజయాన్ని నమోదు చేయాలని తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పావులు కదుపుతుండగా.. మొదటి సారి బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇప్పటికే ఇరు పార్టీలు ప్రచారం, విమర్శలు, ఆరోపణలతో రాజకీయాన్ని వేడెక్కించాయి. 294 స్థానాలకు జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందో చూడాలి. తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌పని చేస్తుండడం విశేషం. అయితే ఎన్నికలకు ముందు పలువురు తృణముల్‌ నేతలు బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బాగా పుంజుకోవడంతో శాసన సభ ఎన్నికల్లోనూ గెలుపుపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు..

జయలలిత, కరుణానిధి హాయం ముగిసి, కొత్తతరం నేతల నేతృత్వంలో తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. డీఎంకే ను కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ నడిపిస్తుండగా.. అన్నాడీఎంకేలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జైలు నుంచి శశికళ విడుదల కావడం, మరో వైపు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంలు అన్నాడీఎంకే నాయకత్వం కోసం ఎత్తులు వేస్తుండడంతో ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు స్థానిక పార్టీలతో కలసి వెల్లడం తప్పా సొంతంగా ఉనికిచాటుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ పార్టీ డీఎంకేతో వెళుతుండగా.. బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుంటోంది. రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించి, వెనక్కి తగ్గిన రజనీకాంత్‌ ఈ ఎన్నికల్లో మౌనంగా ఉంటారా..? లేదా ఏ పార్టీకైనా మద్ధతు ప్రకటిస్తారా..? అనే అంశంపై చర్చ సాగుతోంది. 234 స్థానాలు గల తమిళనాడులో జయలలిత నేతృత్వంలో.. అన్నాడీఎంకే వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కేరళలో పాత కాపుల మధ్యనే పోటీ..

140 స్థానాలు ఉన్న కేరళలో ప్రస్తుతం వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఈ సారి ఎలాగైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ రెండు కూటమిలకు తోడుగా ఈ సారి తాను కూడా పోటీలో ఉన్నానని బీజేపీ ప్రకటిస్తోంది. గత ఎన్నికల్లో ఒక్కసీటును గెలుచుకోగా.. సదరు ఎమ్మెల్యే రైతు ఉద్యమానికి మద్ధతుగా తన పదవికి రాజీనామా చేశారు. మెట్రోమ్యాన్‌గా పిలుచుకునే శ్రీధరన్‌ ఇటీవల బీజేపీలో చేరారు. బీజేపీ ఆశలన్నీ మెట్రోమ్యాన్‌పైనే పెట్టుకుంది. చెప్పుకోదగ్గ స్థానాలనైనా గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

అస్సోంలో ఆసక్తికరం.

అస్సోం అసెంబ్లీ గడువు ఈ ఏప్రిల్‌తో ముగుస్తోంది. సుదీర్ఘకాలంగా అస్సోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీని 2016 ఎన్నికల్లో బీజేపీ మట్టికరిపించింది. తొలిసారి అస్సోంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లోనూ గత ఫలితాలనే పునరావృతం చేయాలనే పట్టుదలతో బీజేపీ ఉండగా.. అటు కాంగ్రెస్‌కీలక నేత అయిన తరుణ్‌ గోగోయ్‌ మరణించడం ఆ పార్టీకి తీరనిలోటుగా మిగిలింది. 126 స్థానాలు గల అస్సాం అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేపీ కూటమి 80 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒక్కటే 60 సీట్లు గెలుచుకుంది.

పుదుచ్చేరిలో ముందే మారిన రాజకీయ చిత్రం..

రాష్ట్ర హోదాతో కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో 33 సీట్లు ఉన్నాయి. మూడు నామినేటెట్‌ సీట్లు కాగా.. మిగతా 30 స్థానాలకు ఎన్నికలకు జరగబోతున్నాయి. కాంగ్రెస్, డీఎంకే కూటమికి ప్రభుత్వం ఇటీవల కుప్పకూలింది. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సీఎం నారాయణ స్వామి బలనిరూపణకు సిద్ధం కావాల్సి వచ్చింది. అసెంబ్లీ సమావేశం అయినా.. సంఖ్యాబలం లేకపోవడంతో సీఎం నారాయణ స్వామి తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పుదుచ్చేరిని పాలిస్తున్నారు. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, ఈ సారి కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీలు పుదుచ్చేరిలో పర్యటిస్తున్నారు.