ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కాక తగ్గడం లేదు. వరుస ఎన్నికలతో ఇప్పటికే రాష్ట్రమంతా హడావుడిగా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దింతో ఆశావహుల్లో, పార్టీ నేతల్లో తప్ప ఈ ఎన్నికల హడావుడి బయటకు కనిపించే అవకాశం లేదు.
ఇది షెడ్యూల్..
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా లో ఇటీవల ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటినీ భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నామినేషన్ల దాఖలుకు మార్చి 4న తుది గడువుగా నిర్ణయించారు. మార్చి ఎనిమిదో తేదీ నాటికి నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 15వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు.
మొత్తం ఆరు స్థానాలకు..
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. టీడీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంధ్యారాణి, గుండుమల తిప్పేస్వామి, వీవీవీ చౌదరి స్థానాలతో పాటు వైకాపా నేతలు మహమ్మద్ ఇక్బాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్, చల్లా రామకృష్ణారెడ్డి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యుల పదవీ కాలం తో పాటు వైస్సార్సీపీ తరుపున ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికైన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం కూడా పూర్తయింది. ఇక ఇటీవల ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేసి రాజ్యసభ ఎంపీగా వెళ్ళిన పిల్లి సుభాష్ చంద్రబోస్స్థానం తో పాటు, కరోనాతో మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నారు.
దాదాపు వైస్సార్సీపీకే!
శాసనసభలో ప్రస్తుతం ఉన్నబలం ఆధారంగా అధికార పార్టీకి మొత్తం 6 స్థానాలు దక్కుతాయి. టిడిపి నుంచి నలుగురు సభ్యులు వైసీపీ అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్నారు. దింతో టీడీపీకి ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదు. దీంతో అధికార పార్టీలో ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించే పనిలో ఉన్నారు. మరోపక్క ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ పలువురికి ఎమ్మెల్సీ స్థానాల మీద హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఖాళీ అయిన స్థానాల్లో జగన్ హామీ ఇచ్చిన వారిని ఎంపిక చేస్తారా లేక మరోసారి వారికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి.
దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ ను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచే ఒకరికి వైస్సార్సీపీ టికెట్ ఇవ్వాలని భావించారు. అయితే పోటీ కు ఆ కుటుంబం సభ్యులు సుముఖంగా లేకపోవడంతో, ఎమ్మెల్సీ హామీను జగన్ ఇచ్చారు. దీని తర్వాతనే కొత్త వ్యక్తి పేరును వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా తెరమీదకు తెచ్చారు. దింతో ఒక స్థానాన్ని ఆ కుటుంబానికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కరోనాతో మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల తరఫున ఒకరిని ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దింతో రెండు స్థానాల్లో ఇప్పటికే పూర్తి అయ్యాయని చెప్పుకోవాలి. మిగిలిన స్థానాల్లో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారు ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది చూడాలి.