iDreamPost
android-app
ios-app

సాహసమే ఇది.. ఫలితం ఎలా ఉంటుందో..?

సాహసమే ఇది.. ఫలితం ఎలా ఉంటుందో..?

కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి, విజృంభిస్తున్న తరుణంలో దేశంలో తొలిసారి ఓట్ల పండుగ రాబోతోంది. నంబర్‌ 29వ తేదీ లోపు బిహార్‌ ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వైరస్‌ ప్రభావం ఎలా ఉన్నా.. బిహార్‌ ఎన్నికలు నిర్వహణకే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గుచూపుతోంది. ఈ విషయంపై నెలకొన్న అనుమానాలకు ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చింది. శుక్రవారం మరోమారు సమావేశమైన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకే ముగ్గుచూపింది. కరోనాను కారణంగా చూపుతూ ఎన్నికలను ఆపలేమని కూడా సుప్రిం కోర్టు స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బిహార్‌ ఎన్నికలు సకాలంలోనే జరగాలని కోరుకుంటోంది. కాబట్టి.. ఎన్నికలు జరగడం తథ్యం.

అయితే కరోనా‌ కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పక్రియను ఏ విధంగా పూర్తి చేస్తాయన్నదే ప్రశ్న. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వైరస్‌ ఎలా సోకుతుందన్న అంశాలను చెబుతూ.. వాటి నుంచి స్వియ రక్షణ ఎలా పొందాలో కూడా తెలిపింది. చెక్క, ఇనుము, ప్లాస్టిక్, చివరికి కరెన్సీ నోట్లు.. ఇలా అన్ని వస్తువుల నుంచి వైరస్‌ సోకుతుందని తేల్చారు. వైరస్‌ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకడం ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్నది అందరికీ తెలిసేలా చేశారు. అందుకే కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు నిలిపివేశారు. ఆధార్‌ కార్డులో మార్పులు, చేర్పులకు బయోమెట్రిక్‌ ఉపయోగించాల్సి వస్తుందని ఆ ప్రక్రియను తాత్కాలికంగా ఆపారు. మరి ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటున్న తరుణంలో ఈవీఎంల ద్వారా ఓటు వేసే ప్రక్రియను నిర్వహించడం సాహసమనే చెప్పాలి.

అయితే ఈ సాహసాన్ని చేసి చూపించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పోలింగ్‌ రోజు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. వైరస్‌ లక్షణాలు ఉన్న వారికి స్లిప్పులు పంపిణీ చేసి చివరి గంటలో వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి ఓటరు తప్పకుండా చేతి గ్లౌజులు, మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చేలా చేయాలని నిర్ణయించింది. 7.18 కోట్ల ఓటర్లు ఉన్న బిహార్‌లో ప్రతి ఒక్కరికీ మాస్క్, గ్లౌజ్‌లు పంపిణీ ప్రక్రియ ఎంత మేర విజయవంతం అవుతుందనేది అందరిలోనూ మొదులుతున్న ప్రశ్న. ఎన్నికల సంఘం చేయాల్సిన పనులు సజావుగా జరిగితే ఫర్వాలేదు.. కానీ ఏమైనా కీడు జరిగితేనే అన్ని వేళ్లు వారి వైపు చూపిస్తాయి.

ఇప్పటి వరకూ బిహార్‌లో 1,42,926 మందికి వైరస్‌ సోకగా.. ఇందులో 1,24,976 మంది కోలుకున్నారు. పరీక్షలు కూడా నితీష్‌కుమార్‌ ప్రభుత్వం భారీగానే చేసింది. ఇప్పటి వరకు 39 లక్షల మందికి పరీక్షలు చేసింది. ప్రస్తుతం రోజుకు 1500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రాబోవు రెండు నెలల్లో మరింత తగ్గొచ్చు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే ఫర్వాలేదు.. పెరిగితేనే సమస్య. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఎన్నికల ప్రక్రియ ముగించడమే ఇప్పుడున్న సవాల్‌. ఓట్ల గెలుపు ఏమైనా.. కరోనాపై గెలవడమే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది.