కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. దేశ పటంలో ఏపీ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్రం కొత్త మ్యాప్‌ను విడుదల చేసినందుకు బాబు ఉప్పొంగిపోయారు. ఒక్కసారిగా బీజేపీ చీఫ్ అమిత్‌షాపై తన మనసులోని ప్రేమను ట్వీటర్ వేదికగా వ్యక్తపరిచారు.
దేశ చిత్రపటంలో అమరావతికి చోటు కల్పించిన ఒకేఒక్క పనితో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారని అమిత్‌షాకు బాబు తెలిపారు. అబ్బబ్బో మరింత అంటే ఇంతకు ముందు తెలుగు ప్రజలకు బీజేపీ దగ్గరగా ఉన్నట్టు బాబు మాటలను అర్థం చేసుకోవాలా? లేక బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు తనదైన శైలిలో మాయమాటలతో దగ్గరయ్యేందుకు మచ్చిక చేసుకోవాలని తహతహలాడుతున్నారా?
2014 ఎన్నికలప్పుడు బీజేపీ-టీడీపీ కూటమిగా పోటీ చేసి కేంద్రంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో మొదటి నుంచి ఉద్యమించింది. ఎన్నికలకు ఏడాది ముందు కేంద్రంపై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. తామెక్కడ ప్రజల్లో అప్రతిష్టపాలవుతామోనని టీడీపీ తన మంత్రులను కేంద్ర కేబినెట్ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయించింది. అంతేకాకుండా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.
ఆ తర్వాత కేంద్రంపై, ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాపై బాబు మొదలుకుని టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని తిట్టిపోశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఐదారు ఎమ్మెల్యే సీట్లు, రెండు మూడు ఎంపీ సీట్లు కూడా తమ భిక్షేనని బాబు అండ్ కో కోడై కూసింది.ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి, నాలుగేళ్ల పాటు బీజేపీతో చెలిమి చేసి దేశ చిత్రపటంలో కనీసం అమరావతికి చోటు కల్పించకపోగా, ఇప్పుడు తగదునమ్మానంటూ బీజేపీ గొప్ప ఘన కార్యం చేసిందని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించడం ఆయనకే చెల్లింది.
తమ నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకున్నందుకు బీజేపీ చీఫ్ అమిత్‌షాపై ప్రశంసల జల్లు కురిపించడం బాబు మరచిపోయినట్టున్నారు. మౌనమే అర్ధంగీకారం అని పెద్దలు చెబుతారు. నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్నా కనీసం ట్విటర్ వేదికగా ఒక్కమాట కూడా విమర్శించక పోవడమే ప్రశంసలుగా అమిత్‌షా అర్థం చేసుకోవాలేమో?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ఏటా ఇవ్వాల్సిన రూ.1050 కోట్లు మంజూరు చేయకపోవడం, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులకు బదులు పిడికెడు మట్టి, పోలవరం నిర్మాణానికి తగినన్ని నిధులు మంజూరు చేయలేదని గతంలో బాబు విమర్శలు చేశారు. అలాంటి బీజేపీకి రాష్ర్టంలో స్థానం లేదని హూంకరించి, ఘీంకరించిన బాబుకు ఇప్పుడు అమిత్‌షా ఏపీ పాలిట దైవంగా కనిపంచడం ఏంటో?
బాబు మాటల్లోనే చెప్పాలంటేనే రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టే ఏపీకీ బీజేపీ దగ్గరవుతోందా? ఏపీకీ ఏమీ చేయలేదు కాబట్టే వారి రుణం తీర్చుకునేందుకు మీరు దగ్గర కావాలనుకుంటున్నారా? అందుకేనా ఈ ట్వీట్ల స్వీట్ సందేశాలు. రెండురోజుల క్రితం తీసుకున్న నిర్ణయానికి సంబరాల్లో మునిగి తేలుతూ శనివారం రాత్రి 8 గంటల తర్వాత చంద్రబాబు ట్వీట్ చేయడం వెనుక ఉద్దేశాన్ని పసిగట్టలేనంత అజ్ఞానంతో ఏపీ ప్రజలు లేరని గుర్తిస్తే మంచిది. ఎందుకీ ముసుగులో గుద్దులాటలు…నేరుగా వెళ్లి అమిత్‌షా-మోడీలను కౌగిలించుకుని మరోసారి ప్రేమాయణాన్ని మొదలు పెట్టొచ్చు కదా బాబు గారూ!