iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల ప్రక్రియపై ముగింపు దశకు వచ్చింది. విజేతలను ప్రకటిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ లకు కొత్త పాలకవర్గాలు రాబోతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త నేతల సారధ్యంలో స్థానిక సంస్థల పాలన సాగబోతోంది. అయితే ఈ ఎన్నికల విషయంలో టీడీపీ నేతలు ఎంత గందరగోళంగా ఉన్నారన్నది తాజాగా ఫలితాల వెల్లడి సందర్భంగా స్పష్టమవుతోంది. ఏపీలో విపక్ష వైఖరి గోడమీద పిల్లిలా ఉందనే వాదనను ఇది బలపరిచేలా కనిపిస్తోంది
ప్రస్తుతం కౌంటింగ్ పూర్తవుతున్న ఎన్నికలు గత ఏడాది మార్చిలో జరగాలి. కానీ ఆనాడు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కారణంగా అది ఏడాదిన్నర ఆలశ్యమయ్యింది. అప్పట్లో ఈ ఎన్నికల వాయిదాని టీడీపీ సమర్థించింది. నిమ్మగడ్డకు మద్ధతుగా నిలిచింది. ఇక ఆ తర్వాత నిమ్మగడ్డ పదవీకాలం ముగిసేలోగానయినా స్థానిక ఎన్నికలు పూర్తి చేశారా అంటే అదీ లేదు. కేవలం పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ పోరు మాత్రమే ముగించారు. మిగిలిన పరిషత్ ఎన్నికల ప్రక్రియ సందిగ్ధంలో ఉండడంతో కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించగానే నీలం సాహ్ని వాటి మీద దృష్టి పెట్టారు.
Also Read : టీడీపీ బూతు పంచాంగం – రాజకీయ ప్రణాళికలో భాగమేనా?
అప్పటికే ఏడాదిగా నిలిచిపోయిన పరిషత్ ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంతో ఆమె వేగంగా స్పందించారు. ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించగానే 8వ తేదీన పోలింగ్ కి ఏర్పాట్లు చేశారు. చకచకా కదిలిన యంత్రాంగం పెండింగ్ లో ఉన్న ఎన్నికలను కూడా పూర్తి చేసింది. అయితే చివరి నిమిషంలో ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటనయితే చేశారు. కానీ అప్పటికే బ్యాలెట్ పేపర్లు ముద్రించారు, టీడీపీ నేతలు ప్రచారం కూడా పూర్తి చేశారు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా గెలిచిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధినేత ఇచ్చిన ఎన్నికల బాయ్ కాట్ పిలుపుని తాము పాటించేది లేదంటూ అనేక మంది పోలింగ్ సిబ్బందిని సైతం నియమించి పోరాడారు. చివరి దిశలో పోటీ నుంచి తప్పుకోవడం అంటే ఓటమిని అంగీకరించడమేనని అనేక మంది టీడీపీ నేతలే భావించారు.
అశోక్ గజపతిరాజు , జ్యోతుల నెహ్రూ వంటి వారు చంద్రబాబు నిర్ణయాన్ని తాము పాటించడం లేదంటూ బాహాటంగానే ప్రకటించారు. అనేక చోట్ల నాయకులంతా ఎన్నికల రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవహరించారు. అయినప్పటికీ టీడీపీకి ప్రజల్లో పెద్దగా ఆదరణ కనిపించలేదన్నది బహిరంగ సత్యం. దానిని అంగీకరించడానికి సిద్ధంగా లేని టీడీపీ తీరా ఈరోజు ఫలితాలు వచ్చే వేళ తాము ఈ ఎన్నికలను బహిష్కరించినట్టు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే నిజమయితే మరి టీడీపీకి పడిన ఓట్లను ఏమనాలి అంటే ఆపార్టీ నేతల దగ్గర సమాధానం లేదు. పైగా పచ్చ మీడియా చానెళ్లలో విజేతల వివరాలను ప్రకటించే చోట టీడీపీ బహిష్కరణ అంటూ పేర్కొంటున్నారు. నిజానికి పోటీలో లేకపోతే ఆ పార్టీ వివరాలు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ టీడీపీ పేరు రాస్తూ, అక్కడ మళ్లీ బహిష్కరణ అంటూ గుర్తు చేయడమే విచిత్రంగా ఉంది. దాంతో టీడీపీ నేతలు ఎంత గందరగోళంలో ఉన్నారో, ఓటర్లను మభ్యపెట్టాలని ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది.
Also Read : కుప్పం కోట మీద వైసీపీ జండా ఎగరేసిన హాసిని
విపక్షం హుందాగా ఓటమి అంగీకరించడం వేరు, అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించిందని ఆరోపించడం వేరు. ఆ రెండు కాకుండా ఏకంగా తమ అభ్యర్థులు బరిలో ఉండగానే తాము బహిష్కరించామనే కలరింగ్ ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో మరింత అభాసుపాలుజేసేలా కనిపిస్తోంది. చంద్రబాబు ప్రకటనను ఆపార్టీ కార్యకర్తలే ఖాతరు చేయకపోయినా ప్రజలందరినీ నమ్మించేలనే యత్నంలో ఆయన చేస్తున్న ప్రహసనం చివరకు మరింత అపఖ్యాతిని తెచ్చిపెట్టేలా ఉందన్నది టీడీపీ కార్యకర్తల ఆవేదనగా ఉంది.