గురువారం మాజీ సీఎం చంద్రబాబు కృష్ణాజిల్లా విజయవాడలో భవన నిర్మాణ కార్మికుల తో కలిసి ఇసుకపై దీక్ష తలపెట్టిన రోజు.. ఇదే రోజు విజయవాడకు చెందిన ఇద్దరు తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు ఆ పార్టీని వీడారు. ఓ నాయకుడు అయితే ఏకంగా పార్టీని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధినాయకుడు ఆయన కొడుకు వ్యవహారశైలిని తూర్పారబట్టారు. ఆయనే గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ..
వంశీ గతకొద్దికాలంగా టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలోనే ఆయన టిడిపిని వీడుతున్నానని,రాజకీయాలు వదిలేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష పాత్ర అవసరం లేకపోయినా పోషించాలని ఉవ్విళ్లూరుతున్న చంద్రబాబుకు మొదటి దీక్ష రోజే రెండు భారీ దెబ్బలు పడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్నా తన పవర్ తగ్గలేదని చూపించుకోవడానికి చేసిన దీక్షకు జనం రాకపోవడం, అదేరోజు సొంత పార్టీ నేతలు వదిలి వెళ్లిపోవడం ఒక దెబ్బ అయితే.. ఇంతకాలం మీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తూ వచ్చారు.. ఇప్పుడు అదే మీడియా మొత్తం పార్టీని వదిలి వెళ్తున్న వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ గురించి రాసే పరిస్థితి వచ్చింది. ఓరకంగా ఇది వైసీపీ వేసిన ఎత్తుకు పై ఎత్తు అని చెప్పుకోవడం కంటే చంద్రబాబు చేసుకున్న స్వయంకృతాపరాధం అన్నది నిజం.
గతంలో కూడా జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ ఏ జిల్లాలో అయితే పాదయాత్ర ప్రారంభం కానుండో ఆ జిల్లాలో కానీ లేదా పాదయాత్ర ముగిసిన జిల్లాలో గాని పెద్దఎత్తున వైసిపి ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు అండ్ టీం పావులు కదిపింది. ముఖ్యంగా పాదయాత్ర కొన్ని జిల్లాలకు వెళుతున్నప్పుడు ఆ జిల్లాలో పాదయాత్ర ఏర్పాట్లు చేసే నాయకులు లేకుండా చేయాలని ఆలోచనతో ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకున్నా జగన్ కృంగిపోలేదు. ముఖ్యంగా ప్రకాశం, విశాఖ జిల్లాలకు పర్యటన నిమిత్తం జగన్ వెళ్లేముందే అక్కడి నేతలకు వ్యూహాత్మకంగా వల వేసిన విషయం తెలిసిందే. అలాంటి రాజకీయం చేసింది టిడిపి. అయితే ఇప్పుడు వైసిపి వేసిన స్కెచ్ వల్ల విజయవాడలో తాజా ఘటనలు జరిగాయా.? లేదా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా.? అనేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఆరు నెలలు గడవకముందే చంద్రబాబు అత్యుత్సాహంతో ఇసుకకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా దీక్షకు దిగడం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదంటే అర్థం చేసుకోవచ్చు.