iDreamPost
android-app
ios-app

తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్నాడా ?

  • Published Apr 30, 2020 | 10:54 AM Updated Updated Apr 30, 2020 | 10:54 AM
తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్నాడా ?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తనకు తానే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు వైఖరి రోజురోజుకు దిగజారిపోతోంది. మితిమీరిన ప్రచారయావతో తన స్ధాయిని తానే చంద్రబాబు దిగజార్చేసుకుంటున్నాడనే అనుమానలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డిపై పిచ్చి ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. అధికారంలో ఉన్నపుడు ఎలాగూ ఎల్లీమీడియా భజన చేస్తుంది కాబట్టి ప్రచారానికి అంతు లేకుండా ఉంటుంది. మరి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి.

ఇక్కడే చంద్రబాబులోని టెన్షనంతా బయటపడిపోతోంది. అధికారంలో ఎవరున్నా వాళ్ళ తాలూకు వార్తలు, పాజిటివ్ కథనాలు మొదటిపేజిలో ప్రముఖంగా రావటం, ప్రతిపక్ష నేతల వార్తలు లోపలిపేజీల్లోకి వెళ్ళిపోవటం సహజం. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన గురించే మీడియాలో ప్రముఖంగా రావాలని కోరుకునే వ్యక్తి. దానికి తగ్గట్లే ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టి మెజారిటి మీడియాలో మొదటిపేజీల్లో చంద్రబాబే హైలైట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూడా మొదటి పేజీల్లో హైలైట్ చేస్తున్నా మొత్తం నెగిటివ్ గానే చూపిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కరోజు తాను మీడియాలో కనబడకపోతే జనాలు తనను ఎక్కడ మరచిపోతారో అనే బెంగతో జగన్ పై చంద్రబాబు నోటికిచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడు. జగన్ కు సంబంధం లేని విషయాల్లో కూడా లాగి మరీ బురద చల్లేస్తున్నాడు. అయితే వాస్తవాలేంటో తెలుసుకుంటున్న జనాల్లో చంద్రబాబు స్ధాయి తగ్గిపోతోంది. గతంలో ఇసుక కొరతంటూ నానా యాగీ చేశాడు. వరదలు, భారీ వర్షాలున్న సమయంలో రీచుల నుండి ఇసుక తవ్వకాలు సాధ్యం కాదని తెలిసినా జగన్ పై కావాలనే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా బురద చల్లే ప్రయత్నం చేసింది. అయితే వాస్తవాలు తెలుసు కాబట్టే జనాలు వాళ్ళ ఆరోపణలను పట్టించుకోలేదు.

తాజాగా కరోనా వైరస్ సంక్షోభాన్నే తీసుకుంటే పరీక్షలు జరగటం లేదని కొన్ని రోజులు గోల చేశారు. ఇపుడు పరీక్షలు చేస్తుంటే కేసులు పెరిగిపోతున్నాయంటూ యాగీ చేస్తున్నారు. అంటే జగన్ ఏమి చేసినా తప్పే ఏమీ చేయకపోయినా తప్పే అన్నట్లుగా ఉంది చంద్రబాబు, ఎల్లోమీడియా వ్యవహారం. ఇటువంటి బురద చల్లుడు రాజకీయాలను జనాలు గమనిస్తునే ఉన్నారు. అందుకనే చంద్రబాబు, ఎల్లోమీడియా ఎంతగా రెచ్చగొడుతున్నా జనాలు పట్టించుకోవటం లేదు.

అంటే చంద్రబాబు ఆరోపణలు కేవలం ఎల్లోమీడియాలో అచ్చేసుకోవటానికి తప్ప మరెందుకు పనికి రావటం లేదని తేలిపోయింది. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి చేసే ఆరోపణలకు చాలా విలువుండాలి. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదంటే ఏమిటర్ధం ? తన రాజకీయ వ్యూహాలు అవుట్ డేటెడ్ అయిపోయాయని చంద్రబాబు గ్రహించటం లేదు. అర్ధం పర్ధం లేని బురదచల్లుడు ఆరోపణలతో చివరకు తన స్ధాయిని తానే చంద్రబాబు దిగజార్చేసుకుంటున్న విషయం అర్ధమైపోతోంది. కాబట్టి ఇకనైనా చంద్రబాబు కాస్త హుందాగా ఉంటే బావుంటుంది.