Idream media
Idream media
1992లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా “ఆ ఒక్కటీ అడుక్కు” లో అల్లు రామలింగయ్య పాత్ర రిటైరయిన రైల్వే ఉద్యోగి. పాత అలవాటు వదులుకోలేక ప్రతిరోజూ యూనిఫాం వేసుకుని పచ్చజెండా, ఎర్రజెండాలు పట్టుకుని ఇంటికి ఎవరైనా వస్తే “టికెట్ ఉందా? ప్లాట్ ఫాం టికెట్ కొన్నారా?” అనడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరస ఇలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన నిర్వహించే వీడియో కాన్ఫరెన్సులు అధికారులని హడలెత్తించేవి. చెప్పిందే చెప్తూ, ఒక పట్టాన ఆపక, ఒకే విషయం మీద మళ్లీ మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ పెడుతూ అధికారుల సహనానికి పరీక్షలు పెడుతూ, ఏ విషయమైనా అందులో నిష్ణాతులైన నిపుణులకి కూడా దిశానిర్దేశం చేస్తూ చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు ఇప్పుడు లేకుండా పోవడంతో చాలా మంది అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే అలవాటైన ప్రాణం కాబట్టి వీడియో కాన్ఫరెన్సులు లేకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నాడు. అందుకే అధికారంలో లేకపోయినా తన నియోజకవర్గంలోని అధికారులతో ఒకసారి, పార్టీ నాయకులతో పలుమార్లు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి తృప్తి పడుతూ ఉండగా, కరోనా మహమ్మారి వచ్చి, జూమ్ రూపంలో చంద్రబాబుకి మహత్తర అవకాశం కల్పించింది. తన వయసు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఇల్లు దాటకుండా ఉండవలసిన పరిస్థితి కాబట్టి మహానాడు నుంచి నిరసన ప్రదర్శనల వరకూ ఇంట్లో కూర్చుని జూమ్ లోనే లాగించేశారు. ఇంట్లో కూర్చుని నిరసన వ్యక్తం చేయడంలోని సుఖం గమనించిన తమ్ముళ్ళూ ఆయన బాటలోనే నడుస్తున్నారు.
Also Read:సోనీ సూద్ ట్రాక్టర్, ఆ రైతు కథలో అసలు ట్విస్ట్ ఇదే..
తాజాగా నిన్న ఆయన కొంతమంది వైద్యులతో రాష్ట్రంలో కరోనా గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారం లేకపోయినా అయననూ, పార్టీనీ అభిమానించే వైద్యులు ఇందులో పాల్గొన్నారు. అంతవరకూ బావుంది. తప్పు లేదు. అయితే అంతమందిని ఒక్కసారిగా చూసిన ఆయనలోని మునుపటి చంద్రబాబు మేల్కొన్నాడు. “ప్రతిరోజూ కరోనా బారిన పడిన రోగుల సంఖ్య, మృతి చెందిన రోగుల సంఖ్య నోట్ చేసుకుని వారం చివరిలో నా అధ్యయనం కేంద్ర ఆరోగ్య శాఖకు పంపుతున్నాను” అని చెప్పుకున్నారు. అధికారికంగా ఏ రోజుకారోజు నివేదికలు కేంద్రానికి పోతుంటాయని ఆయనకు తెలియదా? ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఈయన పంపిన నివేదిక ఉన్న మెయిల్ మహా అయితే ఓపెన్ చేసి,” రిసీవ్డ్, థాంక్స్ “అని ఒక మొక్కుబడి రిప్లై ఇచ్చి డిలీట్ చేస్తారని కూడా ఆయనకు తెలిసే ఉంటుంది.
ఇదే సందర్భంలో ఆయన కొన్ని గణాంకాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రతి పది సెకన్లకూ ఒక కోవిడ్ మరణం సంభవిస్తుందట. ఇది చెప్పే ముందు తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ లోని కేలిక్యులేటర్ తీసి చిన్న లెక్క వేసి ఉంటే రోజులో 86,400 సెకన్లు ఉంటాయని, అదే ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి చూసి ఉంటే గడచిన ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచం మొత్తం మీద కోవిడ్ మరణాల సంఖ్య 5689 అని తెలిసి ఉండేది. మరొక లెక్క చేసి ఉంటే ప్రపంచం మొత్తం తీసుకున్నా ప్రతి పదిహేను సెకన్లలో ఒక మరణం సంభవిస్తున్న విషయం కూడా తెలిసి ఉండేది.
Also Read:అశోక్ గెహ్లాట్ ఆ విషయం ప్రస్తావించకపోవడం వెనుక మర్మమేంటి..?
కరోనా మహమ్మారి చాలా ఆందోళనకరంగా తయారవుతోంది అన్న విషయం కాదనలేని సత్యం. అయితే ఇది మన ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదు. మన దేశానికి కూడా పరిమితం కాదు. అధునాతన వైద్య సదుపాయాలు ఉన్న సంపన్న దేశాలు దీని బారిన పడి విలవిల లాడుతున్నాయి. మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినా కరోనాతో పోరాటంలో ఏమీ తక్కువ చేయడం లేదు. ఖరీదైన యాంటీ వైరల్ ఔషధాలు కూడా ఉచితంగా అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పరీక్షలు జరిపే సదుపాయాలు కల్పిస్తున్నారు. క్వారంటైన్ లో ఉన్న రోగులకు మంచి సౌకర్యాలు అందజేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని అని తన గురించి తాను చెప్పుకునే చంద్రబాబు చేతనైతే నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి కానీ తప్పుడు లెక్కలతో ప్రజలలో భయాందోళనలు రేకెత్తించడం భావ్యం కాదు.
చివరిలో సెషన్ ముగించేముందు సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా తండ్రీ కొడుకులు ఇంట్లోనే ఉన్నారనుకున్నా తమ పార్టీ నాయకులు అరెస్టు అయితే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆఘమోఘాల మీద రోడ్డు మార్గంలో వచ్చిన వారు మహానాడు నుంచి నిరసన కార్యక్రమాలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా జూమ్ యాప్ ద్వారా నడిపించేశారు. ఇంటిలో నుంచి కాలు బయట పెట్టకుండా నిరసన తెలపడంలో ఉన్న సుఖం తెలుసుకున్న తమ్ముళ్ళూ ఇదే మార్గం అనుసరించారు. ఇతరులకు సలహా ఇచ్చేముందు మనం పాటించి చూపడం మంచి పద్ధతి అని ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారెవరూ చంద్రబాబుకి గుర్తు చేసినట్లు లేదు.