Idream media
Idream media
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి సమక్షంలోనే దళిత కార్యకర్తపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అనుచరులు భౌతిక దాడికి దిగారు. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడి వ్యవహారశైలిపై బాబుకు ఫిర్యాదు చేయడమే ఆ దళితుడు చేసిన నేరమైంది. జగన్ సర్కార్ దళితులపై దాడికి పాల్పడుతోందంటూ ఒంటికాలిపై లేస్తున్న చంద్రబాబు…ఇప్పుడు తన సమక్షంలోనే సొంత దళిత కార్యకర్తపై జరిగిన దాడికి ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
జగన్ సర్కార్ దళితులపై దాడికి పాల్పడుతోందంటూ ఊరూవాడా దద్దరిల్లేలా అరిచిన చంద్రబాబు…స్వయంగా తన సమక్షంలోనే సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడి అనుచరులే ఓ దళిత కార్యకర్తని చితకబాదుతుంటే ఏయ్‌య్…అని అనడం తప్ప చేష్టలుడిగి చూస్తుండి పోయారు. ఈ ఘటనకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్న కడప శ్రీనివాస కల్యాణ మండపం వేదికైంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబునాయుడు తొలిసారిగా జిల్లాల పర్యటనలో భాగంగా కడపకు వచ్చాడు. మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన మంగళవారం నిర్వహించిన సమావేశంలో కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షించారు.
కడప నియోజకవర్గానికి వచ్చేసరికి 15వ డివిజన్ ఇన్‌చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. శ్రీనివాస్‌రెడ్డి సామాజిక అసమానతలకు పాల్పడుతున్నాడని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. చంద్రబాబు సమక్షంలోనే సుబ్బయ్య చేతిలోని మైకును శ్రీనివాసరెడ్డి అనుచరులు లాక్కొని మాట్లాడనివ్వలేదు. అయినప్పటికీ సుబ్బయ్య ఏదో చెప్పబోతుండగా భౌతిక దాడికి పాల్పడ్డారు.
తన సమక్షంలోనే దళిత కార్యకర్తపై భౌతికదాడికి పాల్పడడంతో చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తనదైన శైలిలో హెచ్చరించారు. అయితే దాడికి పాల్పడిన శ్రీనివాసరెడ్డి అనుచరులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని సమాచారం. కాగా ఈ సంఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో సుబ్బయ్య ఫిర్యాదు చేశాడు. పోలీసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో పాటు అతని అనుచరులు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.