ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా జనసేన తగిన గౌరవం ఇస్తున్నట్టు కనిపించడం లేదు. టీడీపీ ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేన తీరు దానికి తగ్గట్టుగానే ఉంది. గతంలో ఇసుక కోసం చంద్రబాబు విజయవాడలో దీక్ష నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జనసేన సంఘీభావం తెలిపింది. కానీ జనసేన తరుపున శివశంకర్ తో పాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. సీనియర్ నేత దీక్షకు ఓ ఎమ్మెల్యే స్థాయి నేత సంఘీభావం చెప్పేందుకు హాజరుకావడం కొంతవరకూ సంతృప్తి కలిగించినప్పటికీ తాజాగా టీడీపీ అఖిలపక్ష సమావేశానికి హాజరయిన జనసేన నేతలను చూస్తే ఆశ్చర్యపడక తప్పదు. ఆపార్టీ తరుపున చంద్రబాబు సరసన మాట్లాడేందుకు సిద్ధమయిన నేతలను గమనిస్తే జనసేన పార్టీ చంద్రబాబుని చిన్నచూపు చూస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
జనసేన తరుపున చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరయిన ఇద్దరు నేతల్లో ఒకరు బొలిశెట్టి సత్య. ఆయన విశాఖలో కూడా సామాన్య ప్రజలకు సంబంధం లేని నాయకుడు. ఆయన గురించి విశాఖ వాసుల్లో చాలామందికి ఏమీ తెలియదు. పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ కి దగ్గరయ్యారు. ఆయన్ని కీలక సమావేశానికి పంపించడం వెనుక జనసేనాని వ్యూహం ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ఆయనకు తోడుగా పోతిన మహేష్ అనే విజయవాడకు చెందిన నాయకుడిని కూడా ఈ సమావేశానికి పంపించారు.
వాస్తవానికి జనసేన తరుపున సీనియర్ నేతలు గానీ, ఇతర నేతలు గానీ పాల్గొంటారని టీడీపీ ఆశించింది. కానీ దానికి భిన్నంగా సాధారణ నేతలను పంపించడంతో టీడీపీ ఖంగుతిన్నట్టు కనిపిస్తోంది. విశాఖలో జనసేనాని లాంగ్ మార్చ్ కార్యక్రమంలో టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యే లేదా ఇతర మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తారని ఆశిస్తే ఊరూపేరు తెలియని నేతలు రావడంతో చంద్రబాబు కూడా అవాక్కయినట్టు చెబుతున్నారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏమిటన్నది మాత్రం వారికి అంతుబట్టడం లేదు.