iDreamPost
android-app
ios-app

తనకు దక్కనిది మరెవరికి దక్కకూడదనే హథ్రాస్ ఘటన – సీబీఐ

తనకు దక్కనిది మరెవరికి దక్కకూడదనే హథ్రాస్ ఘటన – సీబీఐ

సెప్టెంబరు 14 న ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్ లో జరిగిన ఘటన యావత్తు దేశాన్ని కదిలించింది. పొలంలో గడ్డికోయడానికి వెళ్లిన యువతిపై నలుగురు యువకులు సామూహికంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకులయ్యారు. అత్యంత పాశవికంగా క్రూరంగా ఆమెపై దాడికి పాల్పడడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అంతేకాకుండా యువతి తల్లిదండ్రులను అనుమతించకుండా ఆమె మృతదేహానికి పోలీసులు అర్ధరాత్రి రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.

Read Also:- శాంతిభద్రతల కోసమే అర్ధరాత్రి అంత్యక్రియలట..

కాగా సీబీఐ దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. బాధిత యువతితో నిందితుల్లో ఒకరైన సందీప్ అనే యువకుడు ప్రేమ వ్యవహారం నడిపాడని వారిద్దరూ 2019 అక్టోబరు 17 నుంచి 2020 మార్చి 3 వరకూ 105 ఫోన్‌కాల్స్‌ చేసుకున్నారని సీబీఐ వెల్లడించింది. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి తెలియడంతో ఆయన సందీప్ తండ్రికి పిర్యాదు చేసాడు. సందీప్ తండ్రి గ్రామ పెద్ద కావడంతో రెండు కుటుంబాల మధ్య పంచాయితీ జరిగింది. దీంతో యువతిని ఆమె తండ్రి తీవ్రంగా మందలించడంతో ఆమె సందీప్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టింది.

కానీ ప్రేమించిన యువతి దూరంగా పెట్టడంతో సందీప్ తన ఫోన్ నుండే కాకుండా వేరే ఫోన్ నంబర్ల నుండి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసాడు. ఆమె మాట్లాడేందుకు తిరస్కరించడంతో కోపం పెంచుకున్న సందీప్ ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందేమో అన్న అనుమానం కూడా పెంచుకుని ఆమె ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని అవకాశం కోసం ఎదురు చూసాడు.కుటుంబ సభ్యులతో కలిసి గడ్డి కోసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ఒంటరిగా దొరకడంతో తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అమెపై పాశవికంగా దాడి చేసి గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం చేసాడు. నాలుకను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని అక్కడనుండి వెళ్లిపోయారు.

Read Also:- హథ్రాస్‌ బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు రంగంలో దిగిన పోలీసులు..

తమ కుమార్తె కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలు కనుగొని ఆసుపత్రికి తరలించారు. కానీ ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది. కొద్దిరోజుల ముందు బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని సీబీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణంతో పాటు మరిన్ని వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది..