పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంబికా దర్బార్ బత్తీ, అంబికా ప్రొడక్షన్స్‌తో వంటి పలు సంస్ధలతో ప్రజలకు చేరువైన ప్రముఖ కార్పోరేట్ సంస్థ అంబికాలో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. గతంలో ఏలూరు పవర్ పేట స్టేట్ బ్యాంకులో కూడా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
కాగా అంబికా సంస్ధలకు చెందిన పలువురు భాగస్వాములు వేర్వేరు పేర్లతో రుణాలు సేకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో రుణాలు తీసుకునేందుకు వేర్వేరు పేర్లు ఉపయోగించినట్లు అంబికా గ్రూపు సంస్ధల భాగస్వాములపై ఆరోపణలు ఉన్నాయి. కానీ సీబీఐ అంబికాలో జరుపుతున్న ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ సీబీఐ అధికారులు కానీ అంబికా ప్రతినిధులు కానీ మీడియా ముందుకు వచ్చి ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంబికా గ్రూపు సంస్ధలకు అధినేతగా బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ వ్యవహరిస్తున్నారు. అగరబత్తీల వ్యాపారంతో ప్రారంభమైన అంబికా సంస్థ అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో అనేక చిత్రాలను కూడా నిర్మించింది. అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ గతంలో రెండుసార్లు ఏలూరు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. టీడీపీ హయాంలో ఆయన ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. కాగా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం అంబికా కృష్ణ బీజేపీ గూటికి చేరారు.
కాగా పెద్ద ఎత్తున రుణాలు పొందడం కోసం వేర్వేరు పేర్లను అంబికా సంస్థల వ్యాపార భాగస్వాముల ఉపయోగించినందున సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏలూరు పవర్ పేటలో ఉన్న అంబికా కృష్ణ నివాసంలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సీబీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం మీడియాకు సోదాలు చేయడానికి గల కారణాన్ని సీబీఐ అధికారులు వెల్లడించనున్నట్లు సమాచారం.