తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. కాగా నరసింహస్వామి రథం దగ్ధం కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కాగా ఈ ఘటనపై జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) చక్రధరరావును విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేసింది. కొత్త రథం తయారీకి, ఇతరత్రా పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులను పంపింది. స్థానిక అధికారులకూ అక్కడే ఉండి సమీక్షించేట్టుగా తగు ఆదేశాలిచ్చింది. కానీ రథం దగ్ధం వ్యవహారాన్ని రాజకీయం చేయాలని పలు పార్టీలు ప్రయత్నాలు చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది.
రథం దగ్ధం కావడాన్ని అనుకూలంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి కొందరు అసత్య రాజకీయాలకు తెరలేపారు. జగన్ ప్రభుత్వాన్ని ఓ మతానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై పలువురు చేస్తున్న అసత్య ప్రచారానికి చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కారు అంతర్వేది నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ రథం దగ్ధం విషయాన్ని సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరడంతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు సీబీఐ విచారణ కోరుతూ లేఖను పంపింది. సీబీఐ విచారణకు సంబంధించిన జీవో రేపు వెలువడనుంది.