iDreamPost
iDreamPost
అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన బంగారు బుల్లోడు ఫలితం గురించి క్లారిటీ వచ్చేసింది. ఏదైనా కొత్తగా ట్రై చేసి నవ్వించి ఉంటారేమో అని అంచనా పెట్టుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం అది కాదు. వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే ఇదేదో గట్టి హెచ్చరిక లాగే అనిపిస్తోంది. విశ్వసనీయ ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన అనధికార సమాచారం మేరకు కేవలం 66 లక్షలు మాత్రమే షేర్ రూపంలో ఫస్ట్ డే వసూలు కావడం సీరియస్ గా ఆలోచించాల్సిన అంశం. గ్రాస్ చూసుకున్నా అతి కష్టం మీద కోటి దాటింది కానీ రెండో రోజు అంటే నిన్న ఆదివారం సెలవే అయినప్పటికీ పెద్దగా అద్భుతాలు ఆశించలేం కనక ఇంతకన్నా తక్కువే వస్తుంది.
అసలు టాక్ పూర్తిగా బయటికి రాక ముందే బంగారు బుల్లోడు ఇంత తక్కువ వసూలు చేయడం ట్రేడ్ ని సైతం షాక్ కు గురి చేసింది. మొదటి రోజు ఏదోలా జనం వస్తారన్న లెక్క పూర్తిగా తప్పింది. టాక్ వచ్చాక చూద్దాంలే అనుకున్నవాళ్ళే ఎక్కువ. అందులోనూ ప్రమోషన్ విషయంలో టీమ్ శ్రద్ధ వహించకపోవడం స్పష్టంగా కనిపించింది. ఆన్ లైన్ ప్రపంచంతో అంతగా సంబంధాలు ఉండని సాధారణ ప్రేక్షకులకు కనీసం దీని విడుదల గురించి కూడా అవగాహన లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అందులోనూ చాలా మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేట్లు పండగవే కంటిన్యూ చేయడం కూడా ప్రభావం చూపించింది. అనుమతులను సాకుగా చూపించి అధిక ధరలకే అమ్మకాలు చేశారు.
దీన్ని బట్టి నరేష్ మార్కెట్ ఎంత కిందకు వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో 50 సినిమాలు వేగంగా పూర్తి చేసిన ఇతను ఇప్పుడు రెండేళ్లకు ఒకటి చేయడం కూడా కష్టమయ్యే పరిస్థితిని తెచ్చుకున్నాడు. పోనీ మహర్షి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగాడా అంటే అదీ లేదు. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న నాంది మీద తన ఆశలన్నీ. చాలా సీరియస్ సబ్జెక్టుతో రూపొందిన నాందికి డిజిటల్ మార్కెట్ లో పది కోట్ల దాకా డీల్ వచ్చిందనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడీ సిచువేషన్ చూస్తుంటే మాత్రం అది నమ్మేలా లేదు. మొత్తానికి బంగారు బుల్లోడు చేసిన హెచ్చరికను అల్లరోడు ఎలా ఎలా చూసుకున్నా ఇకపై ప్లానింగ్ మాత్రం చాలా అవసరం.