iDreamPost
iDreamPost
ఎన్నికలంటేనే ఓటు వేయడం. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమ పాలకులను తామే ఎన్నుకునే హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లడం, జనం మధ్య వరుసలో నిలబడటం, తమ ఐడెంటిటీని వెరిఫై చేయించుకొని ఓటు వేయడం.. ఇదంతా శ్రమ, సమయంతో కూడుకున్నది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కొత్త విధానాలను తీసుకు వస్తోంది.
ముఖ్యంగా వృద్ధులు, రోగులు, అత్యవసర విధుల్లో ఉన్నవారు, వికలాంగులు ప్రస్తుత విధానంతో ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. వారి కష్టాలను కడతెర్చేందుకు ఒక వినూత్న ప్రయత్నం జరుగుతోంది. అదే ఈ ఓటింగ్ లేదా స్మార్ట్ ఓటింగ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేస్తున్న ఈ ఓటింగ్ విధానం ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఎక్కడి నుంచైనా మన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
Also Read : బీజేపీతో ‘గాంధీ’ల బంధం ముగియనున్నదా ?
స్మార్ట్ ఫోన్ ద్వారా ఓటు
ప్రస్తుతం దాదాపు అన్ని కార్యకలాపాలు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. అదే విధంగా ఓటు హక్కును కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా వేయగలిగేలా తెలంగాణ ఎన్నికల సంఘం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించింది. తెలంగాణ ఐటీ శాఖ, సీ డాక్ సంస్థలు భిలాయ్ ఐఐటీ డైరెక్టర్ రాజత్ మునా సహకారంతో దీన్ని రూపొందించి ట్రయల్స్ కు సిద్ధం చేశారు. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించారు. 15, 20 ఏళ్లనాటి ఫోటోలను కూడా సరిపోల్చగలిగే ఆధునిక ఇమేజింగ్ ప్రాసెసర్ అమర్చారు. స్మార్ట్ ఓటింగ్ విధానం వల్ల ఓటర్లు వేసిన ఓట్లు ఆన్లైన్లో భద్రంగా ఉంటాయి. ఈ డేటాను స్టేట్ డేటా సెంటర్ లో భద్రపరుస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓట్లు లెక్కబెట్టవచ్చు. ఓటింగ్ ప్రక్రియను వెబ్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించవచ్చు.. నియంత్రించవచ్చు.
ఎలా ఓటు వేయాలంటే..
ఈ ఓటింగ్ వేయాలనుకునేవారు ముందుగా తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోనులో ఈ ఓట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత ఓటరు పేరు, ఆధార్ నెంబర్, లైవ్ లొకేషన్, ఓటరు కార్డ్ నంబర్, ఫోటో తదితర వివరాలు యాప్ లో అప్లోడ్ చేసి వెరిఫై చేయించుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అనంతరం అధికారులు కేటాయించిన టైం స్లాట్ లో ఆ యాప్ లోనే ఓటు వేయాల్సి ఉంటుంది.
Also Read : నేడే ఆఖరు : నామినేషన్ల దాఖలులోనూ నాటకీయ పరిణామాలు
నేటి నుంచి ఖమ్మంలో ట్రయల్స్
ఈ ఓట్ యాప్ పనితీరును పరిశీలించలేందుకు ఖమ్మం నగరాన్ని ఎంచుకున్నారు. నగరంలోని పదివేల మందితో ఈ ఓట్ యాప్ ద్వారా ఓట్లు వేయించనున్నారు. మొదట నగర ఓటర్ల జాబితాను యాప్ లోకి అప్లోడ్ చేస్తారు. శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు ఓటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అలా రిజిస్టర్ అయిన వారందరికీ ఈ నెల 20న యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్, ఓటు వేసే విధానాన్ని వివరించే వీడియోలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక సలహాదారు, భిలాయ్, బాంబే, ఢిల్లీ ఐఐటీల ప్రొఫెసర్లు పరిశీలించి, పర్యవేక్షిస్తారు. ట్రయల్స్ లో ఎదురయ్యే లోటుపాట్లను పరిశీలించి సరిదిద్దిన తర్వాత ఈ ఓట్ యాప్ ను వినియోగంలోకి తెస్తామని తెలంగాణ ఎన్నికల అధికారులు వెల్లడించారు.