iDreamPost
iDreamPost
గతంలో టీడీపీలో ఉన్న సమయంలో నిత్యం వార్తల్లో కనిపించిన సాధినేని యామినీ ఇటీవల కొంత సైలెంట్ గానే ఉన్నారని చెప్పాలి. కానీ హఠాత్తుగా ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అయోధ్యలోని రామమందిరం శంకుస్థాపన అంశాన్ని ఉపయోగించుకున్నారు. పలు పోస్టులు చేస్తూ దాని చుట్టూ కొంత హడావిడి చేశారు. ఆ క్రమంలోనే ఎస్వీబీసీ చానెల్ మీద యామినీ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. కొంత అతిగా ఉన్నాయంటూ టీటీడీ భావించే పరిస్థితి వచ్చింది. దాంతో ఆమెపై ఫిర్యాదు చేయడంతో తాజాగా కేసే నమోదయ్యింది.
సాధినేని యామినీ మీడియాలో నిత్యం కనిపిస్తూ చంద్రబాబుని, లోకేశ్ ని కొనియాడేందుకు ఎంతో శ్రమించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీని జనం చిత్తుగా ఓడించిన తర్వాత ఆమె ప్లేటు ఫిరాయించారు. టీడీపీని వీడి బీజేపే గూటిలో చేరిపోయారు. ఆపార్టీలో వ్యవస్థాగత పదవి దక్కించుకున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాంటిది ఎస్వీబీసీ చానెల్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు టీటీడీ అధికారులకు ఆగ్రహాన్ని కలిగించాయి. అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన చానెల్ ప్రసారం చేయాలని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటి కామెంట్స్ చేసే ముందు ఆమె నిర్ధారణ చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడ్డారు.
నిజానికి ఎస్వీబీసీ చానెల్ కూడా అయోధ్య శంకుస్థాపనను ప్రసారం చేసింది కానీ తిరుమల శ్రీవారి నిత్య సేవా కార్యక్రమాల్లో మధ్యాహ్నం పూట భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ కార్యక్రమాలను ప్రసారం చేసింది. దానికి ముందు , తర్వాత కూడా అయోధ్య అంశాన్ని ప్రస్తావించిండమే కాకుండా, ప్రాధాన్యతనిచ్చింది. అయినప్పటికీ టీటీడీ చుట్టూ రాజకీయాలు చేయాలనే సంకల్పంతో ఉన్న ఓ సెక్షన్ దానిని పెద్ద వివాదంగా మార్చింది. రాముడు తప్ప వెంకటేశ్వరుడి కార్యక్రమాలు ప్రసారం చేయకూడదా, ఆయన హిందువుల ఆరాధ్యదైవం కాదా అనే ప్రశ్నలు పెద్దగా వినిపించకపోవడంతో ఈ అంశం వివాదం అయ్యింది. ఆ క్రమంలోనే సాధినేని యామనీ ఓ అడుగు ముందుకేసి అసలు ప్రసారమే చేయలేదనే రీతిలో కామెంట్ చేయడంతో ఆమెపై టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. తిరుపతి టూటౌన్ పీఎస్ లో టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనన్నది చర్చనీయాంశం అయ్యింది.