iDreamPost
iDreamPost
పార్టీ అధిష్టానంలోనే అస్థిరత.. నాయకత్వ స్థానాల్లోనే కలహాలు.. రాహుల్ గాంధీ సమర్థతపై సందేహాలు.. వరుసగా వివిధ రాష్ట్రాల్లో ఓటములు..కీలక సందర్భాల్లో నికరంగా నిలబడలేకపోతుందనే అనుమానాలు ..ఇలా అనేక అననుకూల స్థితిగతులను ఇప్పుడు కాంగ్రెస్ అధిగమించగలుగుతుందా?మళ్లీ దేశంలో నాయకత్వం వహించే స్థానానికి చేరుకుంటుందా?మోదీ హవా ముందు నిలవలేక గడిచిన దశాబ్దకాలంగా వరుస దెబ్బలు తింటున్న పార్టీ మళ్లీ నిలదొక్కుకుంటుందా? దిశానిర్ధేశం చేయగలిగే స్థితికి వెళుతుందా ?అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ని ఓ వైపు కలవరపెడుతుండగా మరోవైపు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే యూపీలో ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కొంత ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా కీలక రాష్ట్రంలో పరువు నిలబెట్టుకునే దిశలో సాగుతోంది. అదే సమయంలో గోవా, త్రిపుర వంటివి చిన్న రాష్ట్రాలే అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు టీఎంసీ ఎత్తులు వేస్తోంది. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకొచ్చి కాంగ్రెస్ ని కలవరపెడుతోంది. తమకు బలమున్న పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కుమ్ములాటలు కొనసాగుతున్న దశలో ఇలాంటి ఇతర విపక్షాలు తమను ఇరకాటంలో పెట్టడం కాంగ్రెస్ ని కలచివేస్తోంది.
ఇలాంటి సమయంలో జరగిన ఉప ఎన్నికలకు కాంగ్రెస్ కి ఊపిరిపోసినట్టుగా అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన వచ్చిన ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, హర్యానాలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత రాష్ట్రంలో ఏకంగా స్వీప్ చేసి వచ్చే ఏడాది చివరిలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ లో కదనోత్సాహం నింపడానికి దోహదపడింది. రాజస్తాన్ లో బీజేపీని మూడోస్థానంలో నెట్టడం, మధ్యప్రదేశ్ లో కూడా ఓట్ల శాతం పెరగడం కాంగ్రెస్ కి సంతృప్తినిస్తోంది. అదే సమయంలో మహారాష్ట్రలో శివసేన, బెంగాల్ లో టీఎంసీ వంటి పార్టీలు బీజేపీని వెనక్కి నెట్టేయడం కూడా కాంగ్రెస్ కి ఊరటనిచ్చేవేనని చెప్పవచ్చు.
తెలంగాణాలో కేవలం 3వేల ఓట్లకు పరిమితం కావడం, బీహార్ లో ఆర్జేడీతో విబేధాలు కొంప ముంచడం వంటివి ఉన్నప్పటికీ కర్ణాటకలో సాధించిన ఫలితాలు కాంగ్రెస్ కి కొండంత బలాన్నిస్తాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం రైతు ఉద్యమం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వాలకు చెంపపెట్టుగా మారి ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినట్టుగా కనిపిస్తోంది. కానీ సాధారణ ఎన్నికల నాటికి సీన్ మారుతుంది. భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కొత్త అస్త్రాలు సిద్ధం చేస్తుంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ తన అంతర్గత సమస్యల నుంచి గట్టెక్కకుండా అడుగువేయడం సాధ్యం కాదు. సొంత పార్టీని చక్కదిద్దుకుంటేనే బీజేపీ మీద వ్యతిరేకత తోడ్పడుతుంది. లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని పక్కదారి పట్టించేందుకు బీజేపీ పలు ప్రయత్నాలు చేస్తుందనడంలో సందేహం లేదు. మొత్తంగా కాంగ్రెస్ కి మళ్లీ ఆశలు చిగురించాలంటే సొంత గూటిని చక్కదిద్దుకోవడం అత్యవసరంగా ప్రస్తుత పరిస్థితి చెబుతోంది.