ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ సహా పలువురి ప్రముఖులను కలిసి ఏపీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. వినతిపత్రాలు సమర్పించారు. జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన రెండు, మూడు రోజులకే ఏపీకి మేలు జరిగేలా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాజాగా విభజన సమస్యలపై కూడా దృష్టి సారించింది. జగన్ పేర్కొన్న సమస్యలపై చర్చించడానికి ఓ బృందాన్ని ఢిల్లీకి ఆహ్వానించిన కేంద్ర కమిటీ.. ఆ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏపీకి మంచి జరిగేలా పలు ప్రకటనలు వెలువడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
పెండింగ్‌లో ఉన్న ఏపీ సమస్యలు, విభజన హామీల అమలుపై ప్రధాని కార్యాలయం అధికారులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో… రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌తో కూడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్‌శర్మతో కలసి విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ప్రధానితో భేటీ అయినప్పుడు సమర్పించిన వినతిపత్రంలో ప్రస్తావించిన విభజన సమస్యల పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర కార్యదర్శులతో కమిటీని ప్రధాని ఏర్పాటు చేశారని, వారితో నేడు సమావేశం జరిగిందన్నారు.
విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కేంద్ర కార్యదర్శుల బృందం సానుకూలంగా స్పందించిందని చె ప్పారు. ‘‘ప్రధాని కార్యాలయ అధికారులతోపాటు దాదాపు 20 మంది ఆర్థిక, సంబంధిత కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు భేటీలో పాల్గొన్నారు. చర్చలు సుదీర్ఘంగా జరిగాయి. అంటే ఎంత సానుకూల వాతావరణంలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రికి, రాష్ర్టానికి… ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ భేటీయే నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన సవరణ అంచనా వ్యయాన్ని యథావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చాం. పునరావాసంతో పాటు మిగతా అన్ని అంశాలలోనూ రాష్ర్టానికి ప్రయోజనం కలిగేలా చర్చలు సాగాయి. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న నిర్ణయానికి లోబడి మా ప్రభుత్వ కార్యదర్శులు నిరంతరం కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతారు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.