iDreamPost
iDreamPost
చిక్కడు దొరకడు.. అన్న రీతిలో తెలుగుదేశంతో దోబూచులాడుతున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధం అయినట్లు కనిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా పార్టీతో సంబంధం లేనట్లుగా ఉంటున్న గంటాను శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రమ్మని అధిష్టానం నుంచి కబురు వెళ్లింది. ఆయనతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీతో దూరం పాటిస్తున్న 12 మంది నేతలకు ఇదే రీతిలో పిలుపు వెళ్లింది. గత ఎన్నికల్లో ఓటమి భారంతో చితికి చెల్లాచెదురైన పార్టీని మళ్లీ గాడిలో పెట్టి వచ్చే ఎన్నికలకు సిద్ధంచేసే పనిలో ఉన్న అధిష్టానం.. అందులో భాగంగా చిక్కుముడిలా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. వాటిలో గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఒకటి.
అధికారం కోల్పోవడంతో పార్టీకి దూరం
2014 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా చేసిన గంటా శ్రీనివాసరావు ఎంతో చురుకుగా ఉండేవారు. 2019 లో నియోజకవర్గం మారి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే జగన్ వేవ్లో రాష్ట్రంలో టీడీపీ కొట్టుకుపోవడంతో అధికారానికి దూరం అయ్యారు. అప్పటి నుంచి టీడీపీకి కూడా క్రమంగా దూరమయ్యారు. పార్టీ వ్యవహారాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో గంటా రాజకీయ భవిష్యత్తుపై తరచూ రకరకాల ప్రచారం జరుగుతోంది. మొదట్లో ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తర్వాత బీజేపీలోకి వెళ్తారని కొన్నాళ్లు, జనసేనలో చేరుతారని ఇంకొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు. కాగా ఈ మధ్య కాలంలో గంటా కాపు సామాజికవర్గానికి అధికారం అన్న నినాదంతో ఆ సామాజికవర్గ ప్రముఖులతో విశాఖ, హైదరాబాదులలో భేటీలు నిర్వహించారు.
పెండింగులో రాజీనామా
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో కొన్నాళ్లు హడావుడి చేశారు. ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి స్పీకర్ కు లేఖ పంపారు. ప్రస్తుతం అది ఇంకా పెండింగులో ఉంది. ఆ తర్వాత ఉక్కు ఉద్యమంలోనూ గంటా కనిపించడం మానేశారు. ఇన్ని రకాలుగా రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న ఆయన సొంతపార్టీని మాత్రం పట్టించుకోలేదు. ఆయనకోసం ఇన్నాళ్లు వేచిచూసిన టీడీపీ అధిష్టానం ఇక తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆలస్యం చేస్తే విశాఖ ఉత్తర నియోజకవర్గం చేజారిపోయే ప్రమాదాన్ని గుర్తించి గంటాతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన్ను రాష్ట్ర కార్యాలయానికి రావాలని పిలిచిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో మరికొన్ని గంటల్లో గంటా టీడీపీలో కొనసాగుతారా.. లేదా.. అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read : గుప్తదాతలే కాదు గుప్త అభిమానులూ ఉన్నారు..!