Idream media
Idream media
పార్లమెంట్ ఆమోదం పొందిన పౌరసత్వ బిల్లు ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా మైనారిటీ వర్గాలు ఈ బిల్లు ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు విరద్ధమంటూ ఓ ఐపీఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అబ్దుర్ రహమాన్ ప్రస్తుతం ముంబై(రాష్ట్ర మానవ హక్కుల కమిషన్)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు.
ఈ నేపథ్యంలో.. ‘రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి పౌరసత్వ సవరణ బిల్లు 2019 పూర్తి వ్యతిరేకంగా ఉంది. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగించేదిగా ఉన్న ఈ బిల్లును నేను ఖండిస్తున్నా. నా సర్వీసును వదిలేస్తున్నా. రేపటి నుంచి విధులకు హాజరుకాను’ అంటూ ట్విటర్‌లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. భారత లౌకికవాద భావనకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని విఙ్ఞప్తి చేశారు.
కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ (సవరణ) బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పెద్దల సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును లోక్‌సభ సోమవారమే ఆమోదించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింల హక్కులకు విఘాతం కల్పించేదిగా ఉందంటూ విమర్శిస్తున్నాయి. ఈ బిల్లుపై నిరసనలతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.