ఇక నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న శరణార్థులు మనవారే. అవును తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా శరణార్థులు భారత పౌర సత్వం దక్కనుంది. సోమవారం అర్ధరాత్రి లోకసభ ఆమోదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు బుధవారం రాజ్యసభ లో ఆమోదం పొందింది.
సుదీర్ఘ చర్చ తర్వాత విపక్షాలు పలు సవరణలు చేయాలని పట్టుపట్టినా ఆ విధమైన చర్యలేవి కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. బిల్లులో 43 సవరణలు చేయాలని విపక్షాలు కోరగా దీనిపై పెట్టిన ఓటింగ్ లో అనుకూలంగా 99, వ్యతిరేకంగా 124 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 మంది సభ్యులు ఓటు వేశారు. లోక్ సభలో మద్దతు ఇచ్చిన శివసేన రాజ్యసభలో మద్దతు తెలుపలేదు.
ఈ పౌర సత్వ చట్ట సవరణ బిల్లు ద్వారా 2014 మార్చి31లోపు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ల నుండి వచ్చిన శరణార్థులు హిందు, సిక్కు, జైన్, పార్శి, బౌద్ధ, క్రైస్తవ మతస్తులకు భారత్ పౌరసత్వం దక్కనుంది. శరణార్థులుగా 2014లోపు భారత్ లోనికి వచ్చి కనీసం ఐదేళ్లపాటు నివసిస్తున్న వారు ఇక నుండి భారత పౌరులు అవ్వనున్నారు. దేశ వ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యింది.
చట్ట సవరణ ద్వారా ప్రమాదం పొంచి ఉందని మేధావులు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిఘా సంస్థలు దీనిపై కేంద్ర ప్రభుత్వానికి పలు హెచ్చరికలు కూడా జారిచేసాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సవరించిన పౌర చట్ట సవరణ బిల్లు ద్వారా శరణార్థుల ముసుగులో ఎలాంటి కుట్రదారులు భారతదేశంలోకి చొరబడకుండా తగు చర్యలు కేంద్రమే తీసుకోవాలి.