తెలుగు రాష్ట్రాలో జరుగుతున్న రెండు అసెంబ్లీ నియోజవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌లో అందరూ ఊహించిందే జరుగుతోంది. తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ ఉప ఎన్నికల్లో ఓ మోస్తరుగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ఇంకా సాగుతూనే ఉంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి హుజురాబాద్‌లో 76 శాతం, బద్వేల్‌లో 55 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుండడంతో.. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌తో పోల్చుకుంటే.. బద్వేల్ కన్నా హుజురాబాద్‌లోనే ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో బద్వేల్‌లో 76.37 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల్లో ఐదు గంటలకు 55 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రాత్రి ఏడు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దీనికి అదనంగా మరో ఐదు శాతం కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద బద్వేల్‌లో దాదాపు 60 శాతం పోలింగ్ నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే.. ఉప ఎన్నికల్లో దాదాపు 15 శాతం తక్కువ పోలింగ్ నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక హుజురాబాద్‌లో గత ఎన్నికల కన్నా ఎక్కువగా పోలింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైంది. మరో రెండు గంటలు పోలింగ్‌కు అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కన్నా.. స్వల్పంగా ఈ సారి ఎక్కువ పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో.. అక్కడ రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. టీఆర్‌ఎస్, బీజేపీలు.. పోలింగ్‌లోనూ హోరాహోరీగా తలపడుతున్నాయి. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లకు డబ్బులు పంచే ఘటనలు వెలుగుచూశాయి.
Also Read : By Election Polling Percentage – ఆసక్తికరంగా ఉప ఎన్నికల పోలింగ్.. మొదటి మూడు గంటల్లోనే ఓటెత్తారు