iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా గత నెల 30న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి ఫలితాల సరళిని బట్టి బీజేపీ వెనుకంజలో ఉంది. 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాతంలోని 29 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 11 గంటల వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరిగిన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండటం విశేషం.
రాష్ట్రాల వారీగా అసెంబ్లీ ఫలితాలు..
-మధ్యప్రదేశ్ లో జోబాట్, పృథ్విపూర్, రాయ్ గాం స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఈ మూడుచోట్లా బీజేపీ ఆధిక్యత కొనసాగిస్తోంది.
-బీహార్లో అధికార జేడీయూ, ఆర్జేడీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కుశ్వేశ్వర్ ఆస్థాన్ లో జేడీయూ లీడ్లో ఉండగా.. తారాపూర్ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి అరుణకుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీకి దెబ్బ తగిలేలా ఉంది. ఈ రాష్ట్రంలో జుబ్బాల్ కోట్కాయ్, ఆర్కి, ఫతేపూర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్ని చోట్లా ప్రతిపక్ష కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
-పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తోంది. దిన్హాతలో ఆ పార్టీ అభ్యర్థి 60 వేల భారీ ఆధిక్యంలో ఉన్నారు. మిగిలిన శాంతిపూర్, ఖర్దాహ, గోసబ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
-మేఘాలయాలో ఎన్నికలు జరిగిన రాజబల, మౌరేంజికెన్గ్, మౌఘంగ్ స్థానాల్లో ఎంపీపీ, యూడీపీలో చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
-అసోంలో మొత్తం 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్, బీజేపీలు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
-కర్ణాటకలో రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హనగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మనే 182 ఓట్ల స్వల్ప ఆధిక్యత సాధించారు. సిండ్జి లో బీజేపీ 10 వెలకుపైగా మెజారిటీతో కొనసాగుతోంది.
-రాజస్థాన్లో ఎన్నికలు జరిగిన దరియవాద్, వల్లభనగర్లలో అధికార కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది.
-హర్యానాలో ఎన్నిక జరిగిన ఎల్లేనాబాద్ లో ఐఎన్ఎల్డీ అభ్యర్థి అభయ్ చౌతాలా లీడ్లో కొనసాగుతున్నారు.
-మహారాష్ట్రలో దేగ్లుర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జితేష్ అంతపూర్కర్ 2293 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-మిజోరంలోని టూరియల్ నియోజకవర్గంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది.
-తెలంగాణలోని హుజూరాబాద్లో బీజేపీ ఆధిక్యం ఉన్నారు.
-ఏపీలోని బద్వేలు నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యంలో ఉంది.
ఎంపీ ఫలితాలు
దేశంలో మూడు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ, కాంగ్రెస్, శివసేన చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హావేలీలో శివసేన విజయ బాటలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లోని మండీలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా మధ్యప్రదేశ్లోని ఖండ్వా నియోజకవర్గంలో బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా సాగుతోంది.